8,9,10 తరగతి విద్యార్ధులకు కౌన్సిలింగ్
హాస్టల్ విద్యార్ధులకోసం హెల్త్ డ్రైవ్
శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్
న్యూస్‌తెలుగు/విజయనగరం: విద్యార్ధుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే విధంగా వారానికి ఒక గంట పాటు కౌన్సిలింగ్ క్లాసులను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. 8,9,10వ తరగతులు ఎంతో కీలకమని, వివిధ రకాల ఆకర్షణలను లోనయ్యే ఆ వయసులో, విద్యార్ధులకు మంచి చెడులను వివరించడం ద్వారా సక్రమ మార్గంలో నడిచేటట్టు చూడాలని సూచించారు.
ఎంఇఓలు, మోడల్ స్కూల్స్, కెజిబివి ప్రిన్సిపాళ్లు, వివిధ సంక్షేమ వసతి గృహాల అధికారులు, కన్వీనర్లు, హెడ్‌మాష్లర్లతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హాస్టళ్లలో ఎటువంటి అవాంఛిత సంఘటనలూ చోటుచేసుకోకుండా, విద్యార్ధులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలని, విద్యార్ధుల ఆలోచనలు, అభిప్రాయాలను తెలుసుకోవాలని అన్నారు. విద్యార్ధుల సామాజిక, మానసిక స్థితిగతులను, చదువులో వారి స్థాయిని, వెనుకబాటుకు కారణాలను అంచనా వేయాలని చెప్పారు. జిల్లా అధికారులను తీసుకువెళ్లి వారి ప్రసంగాల ద్వారా స్ఫూర్తిని నింపాలని సూచించారు. విద్యార్ధుల భవిష్యత్తు ఉన్నతంగా సాగేలా, వారికి మార్గనిర్ధేశం చేయాలన్నారు. విద్యా ప్రమాణాలు పెరగాలని, ప్రస్తుత విద్యాసంవత్సరంలో శతశాతం ఫలితాలను సాధించేవిధంగా ఇప్పటినుంచే ప్రణాళికను రూపొందించుకొని కృషి చేయాలన్నారు.
విద్యార్దులకు చక్కని మద్యాహ్న భోజనాన్నిఅందించాలని, మెనూలో మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే సూచించాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని అలవాట్ల ఆధారంగా మెనూ నిర్ణయించుకొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని, దీనికోసం త్వరలో వర్క్‌షాపును ఏర్పాటు చేస్తామని తెలిపారు. పరిశుభ్ర వాతావరణంలో భోజనం చేసేలా పరిసరాలను ఉంచాలని ఆదేశించారు. ప్రభుత్వం అందజేస్తున్న సదుపాయాలన్నీ విద్యార్ధులకు పూర్తిగా అందాల్సిందేనని స్పష్టం చేశారు. విద్యార్దుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. హాస్టళ్లు, కెజిబివి, మోడల్ స్కూల్ విద్యార్ధులకు ఆరోగ్య పరీక్షల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. అవసరమైతే ప్రయివేటు వైద్యుల సేవలను కూడా ఇందుకు వినియోగించుకోవాలని సూచించారు. పళ్ల డాక్టర్లచేత డెంటల్ శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు, హాస్టళ్లకు గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా రోడ్లు వేయిస్తామని, చిన్నచిన్న మరమ్మతులకు నిధులను కేటాయిస్తామని ఎంఈఓలకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డిఇఓ ఎన్.ప్రేమ్‌కుమార్, జిల్లా బిసి సంక్షేమాధికారి కె.సందీప్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. (Story: 8,9,10 తరగతి విద్యార్ధులకు కౌన్సిలింగ్)