ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండండి
మండల ప్రత్యేక అధికారులంతా శనివారం రాత్రి ఆయా మండలాల్లోనే అందుబాటులో ఉండాలి
అధికారులను మరింత అప్రమత్తం చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
న్యూస్‌తెలుగు/ఏలూరు : రాష్ట్రంలో తుఫాన్ శనివారం రాత్రికి తీరం దాటుతుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని శనివారం రాత్రి అంతా ప్రతీ క్షణం సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు, మండల ప్రత్యేక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం రాత్రి మండల ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు తో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ తీరం దాటే సమయంలో శనివారం రాత్రి మరింత ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉన్నందున కాలువలు, చెరువు గట్లపై మరింత పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు. బలహీనంగా ఉన్న గట్లను ముందుగానే గుర్తించి ఇసుక బస్తాలతో పటిష్టం చేసే చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఆయా మండలాల్లోని ప్రతీ చెరువుకు ఒక సిబ్బందిని నియమించి ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు. లోతట్టు ప్రాంతంలోని, చెరువు ప్రాంతాలలలోని నివాసిత కుటుంబాలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ తహసీల్దార్ కార్యాలయంలో టార్చ్ లైట్లు, రోప్, కొవ్వొత్తులు, తదితరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. నూజివీడు మండలంలోని ముంపునకు గురైన నివాసిత ప్రాంతాలలోని ప్రజలకు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రంలో జనరేటర్లు అందుబాటులో ఉంచడంతోపాటు, త్రాగునీరు, ఆహారం సరఫరా, కాయగూరలు, అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పునరావాస కేంద్రాలలో పారిశుధ్యం, వైద్య శిబిరం ఏర్పాటు, విద్యుత్ సౌకర్యం వంటివి యుద్ధప్రాతిపదికపై చేపట్టాలన్నారు. గోదావరి, ఎర్రకాలువ, తమ్మిలేరుకు సంబంధించి ఆకస్మిక వరదలు తలెత్తితే ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. (Story : ప్రతీ క్షణం అప్రమత్తంగా ఉండండి)