ఆగష్టు 30న జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవం
ఒకే రోజు లక్ష మొక్కలు నాటడమే లక్ష్యం
జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ వెల్లడి
న్యూస్‌తెలుగు/ విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆగష్టు 30న వనమహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఒకే రోజున జిల్లా వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించామన్నారు. తదుపరి దశల్లో అటవీశాఖ వద్దనున్న మరో ఏడు లక్షల మొక్కలు నాటేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న యీ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్దేశించి చేపడుతున్న యీ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. వనమహోత్సవ ఏర్పాట్లపై కలెక్టర్ బుధవారం కలెక్టర్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు. డెంకాడ మండలం బేతనాపల్లి వద్ద జిల్లా స్థాయి వనమహోత్సవం కార్యక్రమాన్ని అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల ఆవరణల్లో మొక్కలు నాటించేందుకు ప్రణాళికలు రూపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి, ఇంటర్ బోర్డు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని గిరిజన విశ్వవిద్యాలయం, జె.ఎన్.టి.యు.ల పరిధిలో కూడా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో వివిధ పథకాల కింద మొక్కలు నాటే కార్యక్రమాలను వనమహోత్సవం నుంచే ప్రారంభించాలన్నారు. వివిధ సంక్షేమ వసతిగృహాలు, హౌసింగ్ కాలనీలు, దేవాలయాల ఆవరణలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పరిశ్రమలు, ఆసుపత్రులు, రైల్వే భూముల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. రోడ్ల ప్రక్కన, కాల్వ గట్లపై మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని జిల్లాపరిషత్ సి.ఇ.ఓ.కు సూచించారు.
మొక్కలు నాటే కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సెప్టెంబరు 1 నుంచి 15వ తేదీ వరకు జిల్లాలోని విద్యార్ధులకు వివిధ అంశాలపై వ్యాసరచన, డ్రాయింగ్, చిత్రలేఖనం వంటి అంశాల్లో పోటీలు నిర్వహించాలని డి.ఇ.ఓ.కు సూచించారు. మునిసిపాలిటీలు, మేజర్ పంచాయతీల్లో వనమహోత్సవం రోజున సైకిల్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. అన్ని మండలాల్లోనూ ప్రత్యేక అధికారుల నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
సమావేశంలో జిల్లా అటవీ అధికారి ఎస్.వెంకటేష్, జెడ్పీ సిఇఓ శ్రీధర్ రాజా, డి.ఇ.ఓ. ప్రేమ్ కుమార్, హౌసింగ్ పి.డి. శ్రీనివాస్, డి.ఆర్.డి.ఏ. ఏపిడి సావిత్రి, డ్వామా ఇన్‌ఛార్జి పిడి అరుణశ్రీ, డి.ఎస్.డబ్ల్యు.ఓ. రామానందం, ఎల్.డి.ఎం. రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. (Story : ఆగష్టు 30న జిల్లా వ్యాప్తంగా వనమహోత్సవం)