అనధికార మందుగుండు తయారీదార్లుపై
కఠిన చర్యలు చేపట్టాలి
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/విజయనగరం :
జిల్లాలో అనధికారంగా మందుగుండు సామగ్రిని తయారీ, నిల్వలు, విక్రయాలు జరిపే వారిపై దాడులు నిర్వహించాలని, వారిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ పోలీసు అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లుగా తెలిపారు. అదే విధంగా జిల్లాలో లైసెన్సులు కలిగి మందుగుండు సామగ్రి నిల్వలు, విక్రయాలు జరిపే గోడౌన్లు, షాపుల్లో భద్రత ప్రమాణాలు, నిబంధనలు పాటిస్తున్నది, రక్షణ చర్యలు చేపడుతున్నది లేనిది పరిశీలించి, నివేదికలను అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో మందుగుండు నిల్వలు, విక్రయాలు చేపట్టేందుకు సంబంధిత అధికారులు జారీ చేసిన లైసెన్సులను, ఇతర రికార్డులను పరిశీలించాలన్నారు. లైసెన్సులు కలిగిన షాపులు, గోడౌన్లును సంబంధిత పోలీసు అధికారులు సందర్శించి, సంబంధిత గోడౌన్లు, షాపుల్లో భద్రత ప్రమాణాలు, నిబంధనలు పాటించే విధంగా చూడాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా షాపుల యజమానులు చేపట్టిన రక్షణ చర్యలను పరిశీలించాలన్నారు. మందుగుండు నిల్వ చేసే గోడౌన్లు, షాపుల్లో స్మోకింగు అలారమ్స్ ను ఏర్పాటు చేసుకోవాలని, అగ్ని ప్రమాదాల నుండి సురక్షితంగా బయటపడేందుకు గోడౌన్స్, షాపులకు కనీసం రెండు అత్యవసర మార్గాలు ఉండే విధంగా చూడాలన్నారు. అంతేకాకుండా, అగ్ని ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న వస్తువులను గోడౌన్లు, షాపుల్లోకి అనుమతించకుండా చూడాలన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అగ్నిని నియంత్రించేందుకు ఫైర్ ఫైటింగు పరికరాలు అందుబాటులో ఉండే విధంగా షాపు యజమానులు చూడాలన్నారు. అగ్ని ప్రమాదాల నుండి రక్షించుకోవడానికి బకెట్లు, ఇసుక, నీరు కార్బన్ డయాక్సైడ్ వంటి అగ్ని నిరోదించే పరికరాలు, వస్తువులు మందుగుండు షాపులు, గోడౌన్లుకు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. అదే విధంగా ఎటువంటి అనుమతులు లేకుండా రహస్యంగా మందుగుండు తయారీ, విక్రయాలు, నిల్వలు చేసే వ్యక్తుల సమాచారంను సేకరించాలని, దాడులు నిర్వహించి, వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. గ్రామ స్థాయిలో సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని, సమాచారం సేకరించి, మందు గుండును అనధికార విక్రయాలు, తయారీ, నిల్వలు జరిపే వారిపై కఠినంగా ఉండాలన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో వల్లంపూడి పోలీసులు మందుగుండును అనధికారంగా కలిగిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి, ఫైర్ క్రాకర్స్ ను సీజ్ చేసారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. (Story : అనధికార మందుగుండు తయారీదార్లుపై కఠిన చర్యలు చేపట్టాలి)