పట్టణాల్లో కారణాలు లేకుండా
అర్ధరాత్రులు తిరిగితే కేసులు తప్పవు
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లాలోని కార్పొరేషను, మున్సిపాల్టీల్లో సహేతుకరమైన కారణం లేకుండా అర్ధ రాత్రుళ్ళు బహిరంగంగా తిరిగితే వారిపై కేసులు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జారీ చేసిన ఆదేశాలతో గత మూడు రోజులుగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు జిల్లా ఎస్పీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇందులో భాగంగా పట్టణంలోని రైల్వే స్టేషను, ఆర్టీసి కాంప్లెక్స్, మూడు లాంతర్లు, కోట జంక్షన్, బాలాజీ జంక్షన్, దాసన్నపేట, రింగురోడ్డు, కొత్తపేట, ఐస్ ఫ్యాక్టరీ, బొబ్బిలి, నెల్లిమర్ల, రాజాం మున్సిపాల్టీల్లో కొన్ని ముఖ్య ప్రాంతాల్లోను పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. రాత్రి 11గంటల తరువాత వ్యాపారాలు, షాపులు, టిఫిన్ బండ్లు మూసివేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యాపారాలు సాగించినా, సహేతుకమైన కారణం లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరించినా వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు, వారిని పోలీసు స్టేషనుకు తరలించి, కౌన్సిలింగు నిర్వహిస్తున్నారు. సహేతుకరమైన కారణం లేకుండా పట్టణాల్లో గత మూడు రోజులుగా సంచరిస్తున్న 121మంది పై పోలీసులు కేసులు నమోదు చేసి, వారిని పోలీసు స్టేషనుకు తరలించి, తల్లిదండ్రుల సమక్షంలో వారికి కౌన్సిలింగు నిర్వహిస్తున్నారు. నేరాల నియంత్రణలో భాగంగా ఇప్పటి వరకు రాత్రి గస్తీల్లోను, పెట్రోలింగు నిర్వహించడంలో మౌళికమైన మార్పులను చేపట్టారు. రాత్రి విధులకు వెళ్ళే పోలీసు సిబ్బందికి సంబంధిత పోలీసు అధికారులు సమావేశమై, రాత్రి గస్తీలో వారు నిర్వహించాల్సిన విధుల పట్ల వారికి దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా బీటు పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాయింటు పుస్తకాలుగల ప్రాంతాలను తప్పనిసరిగా సందర్శించే విధంగా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా, ఆయా బీటు పరిధిలో నివసించే హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులు కదలికలను కూడా గమనించాలని, ఆయా వివరాలను బీటు పుస్తకంలో నమోదు చేయాలని, అనుమానస్పద వ్యక్తులను ప్రశ్నించి, వారి వివరాలు పూర్తిగా తెలుసుకున్న తరువాతనే విడిచిపెట్టాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. నేరాల నియంత్రణలో భాగంగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పెట్రోలింగు తిరిగే వాహనాలను, బీటు పర్యవేక్షణ అధికారులను నిరంతరం రాత్రుళ్ళు అప్రమత్తం చేయాలని పోలీసు కంట్రోల్ రూం సిబ్బందిని ఆదేశించారు. అంతేకాకుండా, అవసరమైన సమయాల్లో ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన గత 25 రోజుల నుండి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపై 1650 కేసులు, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై 552 కేసులు నమోదు చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. (Story : పట్టణాల్లో కారణాలు లేకుండా అర్ధరాత్రులు తిరిగితే కేసులు తప్పవు)