అంకిత భావం, క్రమశిక్షణతో పని చేసి పోలీసుశాఖ ప్రతిష్ట పెంచాలి
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లాపోలీసు పరేడ్ గ్రౌండులో ప్రతీ శుక్రవారం నిర్వహించే సెరిమోనియల్ పరేడ్ కు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అథిదిగా హాజరై, ఆర్మ్డ్ రిజర్వు సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఆర్మ్డ్ రిజర్వు అధికారులు, సిబ్బంది, హెూంగార్డ్సుతో మమేకమై, వారు నిర్వహించే విధులు, బాధ్యతలపై దిశా నిర్దేశం చేసారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – ఆర్మ్డ్ రిజర్వు, సివిల్ పోలీసు సిబ్బంది మరియు పోలీసుశాఖలో భాగస్వామ్యులైన హెూంగార్డ్సు విధి నిర్వహణలో ఎంతో క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మిగిలిన శాఖల ఉద్యోగుల కంటే పోలీసుశాఖ ప్రత్యేకమైనదని, పోలీసు యూనిఫాంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకొని, పోలీసుశాఖ ప్రతిష్టను పెంచే విధంగా ప్రతీ పోలీసు ఉద్యోగి సత్పప్రవర్తనతో వ్యవహరించాలన్నారు. పోలీసుల కృషి ఫలితంగా జిల్లాలో నక్సలిజం పూర్తిగా సమసిపోయిందని, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసు ఉద్యోగులు ఎంతో సమర్ధవంతంగా పని చేస్తున్నారన్నారు. న్యాయం కోసం పోలీసు స్టేషనుకు వచ్చే బాధితులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యను సహృదయంతో అర్ధం చేసుకొని, పరిష్కార మార్గాలను చూపాలన్నారు. ప్రజలకు పోలీసులు ఎప్పుడైతే మంచి సేవలను అందిస్తారో, సమాజంలో పోలీసువారి పట్ల గౌరవం మరింత పెరుగుతుందన్నారు. హెూంగార్డ్సు కూడా అనేక పోలీసు విధులను పోలీసులతో సమానంగా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారన్నారు. హెూంగార్డు కూడా క్రమశిక్షణతో వ్యవహరించాలన్నారు. ఒక యూనిఫాం ఉద్యోగిగా ఇతరులకు పోలీసులు ఆదర్శంగా ఉండాలన్నారు. ఏ బాధ్యతలను, విధులను అప్పగించినా వాటిని ఎంతో క్రమశిక్షణ, అంకితభావంతో, బాధ్యతాయుతంగా నిర్వర్తించి, పోలీసు శాఖకు గౌరవాన్ని మరింతగా ఇనుమంటింపజేయాలని పోలీసు సిబ్బందికి జిల్లా దిశా నిర్ధేశం చేసారు. ఎవరైనా విధి నిర్వహణలో అలసత్వంగా వ్యవహరించినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా, వారిపై కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.
అనంతరం, పోలీసు ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని, వారి నుండి విజ్ఞాపనలు స్వీకరించి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
పోలీసు పరేడ్ గ్రౌండులో ఆర్మడ్ రిజర్వు పోలీసులు నిర్వహించిన సెరిమోనియల్ పరేడ్ నందు అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, ఎఆర్ అదనపు ఎస్పీ ఎం.ఎం.సోల్మన్, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, రిజర్వు ఇన్స్పెక్టర్లు ఎన్.గోపాల నాయుడు, ఆర్.రమేష్ కుమార్, భగవాన్, పలువురు ఆర్.ఎస్.ఐ.లు, ఆర్మ్డ్ రిజర్వు సిబ్బంది, హెూంగార్డ్సు పాల్గొన్నారు. (Story : అంకిత భావం, క్రమశిక్షణతో పని చేసి పోలీసుశాఖ ప్రతిష్ట పెంచాలి)