అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తు సకాలంలో పూర్తి చేయండి
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందల్ బుధవారం డిఎస్పీ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశంను నిర్వహించి, విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి సబ్ డివిజను పరిధిలో నమోదై, దర్యాప్తులో ఉన్న అట్రాసిటీ కేసులను సమీక్షించి, ఆయా కేసుల్లో ఇంత వరకు జరిగిన దర్యాప్తు తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – అట్రాసిటీ కేసుల్లో చట్ట ప్రకారం వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. అట్రాసిటీ కేసుల్లో ఫిర్యాదు అందిన వెంటనే పోలీసు స్టేషనుల్లో కేసులు నమోదయ్యే విధంగా సంబంధిత డిఎస్పీలు పర్యవేక్షించాలన్నారు. అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తు చేపట్టే డిఎస్పీ స్థాయి అధికారులు విధిగా సంఘటనా స్థలాలను సందర్శించాలని, ప్రత్యక్ష సాక్ష్యులను విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తును 60 రోజుల్లో పూర్తి చేసి, నిందితులపై అభియోగ పత్రాలను న్యాయ స్థానాల్లో దాఖలు చేయాలన్నారు. అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తు పెండింగులో ఉండుటకు గల కారణాలను పరిశీలించి, ఆయా అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, దర్యాప్తు పూర్తి చేయాలన్నారు. కేసుల్లో నిందితులపై నేరారోపణలు న్యాయ స్థానంలో నిరూపణ చేసేందుకు అవసరమైన ప్రధాన సాక్షుల విచారణ చేయాలని, సాంకేతిక ఆధారాలను సేకరించాలని, దృవ పత్రాలను సంబంధిత రెవెన్యూ, మెడికల్ అధికారులు, ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి త్వరితగతిన పొందే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అభియోగ పత్రాల తయారు చేయుటలో న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. అట్రాసిటీ కేసులు దర్యాప్తులో ఉండుటకుగల కారణాలను అధికారులను అడిగి తెలుసుకొని, దర్యాప్తు అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేసి, దిశా నిర్ధేశం చేసారు. అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం సకాలంలో అందేందుకు ఎప్పటికప్పుడు ప్రతిపాదనలను సిద్ధం చేసి, కలెక్టరు ఆఫీసుకు పంపాలని, సకాలంలో బాధితులకు పరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీనివాసరావు, చీపురుపల్లి డిఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, డిటిసి డిఎస్పీ ఎం.వీరకుమార్, ఎస్సై లు గణేష్, మురళీ, జూనియర్ సహాయకులు ఆర్.వి.కిరణ్ కుమార్ మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు . (Story : అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తు సకాలంలో పూర్తి చేయండి)