UA-35385725-1 UA-35385725-1

ఘనంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు

ఘనంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా: కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్‌లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న జరగబోయే వేడుక వివరాలను వెల్లడించేందుకు బుధవారం ఎఫ్‌ఎన్‌సీసీలో క్టరన్ రైజర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంతోమంది అతిరథమహారథులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ ఇద్దరూ స్వర్ణోత్సవ వేడుకల పోస్టర్‌ను లాంచ్ చేశారు.

ఈ కార్యక్రమంలో నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ..‘‘మా తమ్ముడు బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం. ఎలాంటి పాత్రనైనా చేయగల నటుడిగా నిరూపించుకున్నారు. మానాన్న గారికి వారసుడిగా బాలకృష్ణ ఇండస్ట్రీలో నిలబడ్డారు. నటనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా నాన్నగారికి వారసుడిగా బాలకృష్ణ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. హిందూపురం అడ్డా నందమూరి గడ్డ అని నిరూపించారు.’’ అని చెప్పారు.

దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ..‘‘బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా కుర్రహీరోలకు ఏమాత్రం తగ్గకుండా పోటీ ఇస్తున్నారు. ఇండియన్ సినిమాలో అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణే ఇన్ని ఏళ్లు నటుడిగా చేసిన వాళ్లు ఎవరూ లేరు. బాలయ్య స్కూలు వెళ్లేటప్పటి నుంచి ఇప్పుడు కూడా ఒక సామాన్యుడిలా తిరుగుతారు. చాలా సింప్లిసిటీగా ఉంటారు. మేమిద్దరం ఒకసారి గోవా వెళ్లినప్పుడు ఒక ట్రే వాటర్ బాటిల్స్ కొని ఆయనే మోసుకొచ్చారు. అంత సింపుల్‌గా ఉంటారు. బాలయ్య నిర్మాతల మనిషి. నాకు ఇష్టమైన నటుడు. ఆయన 50 వసంతాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి విజయవంతం చేయాలి’’ అని అన్నారు.

నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘‘రామారావు గారి నట వారసుడు నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు ఇండస్ట్రీ మొత్తం కలిసి టాలీవుడ్ పవర్ ఏంటో చూపించేలా గొప్పగా చేస్తాం’’ అని అన్నారు.

నిర్మాత కైకాల నాగేశ్వరరావు మాట్లాడుతూ..‘‘ నందమూరి ఫ్యామిలీతో మా ఫ్యామిలీకి చాలా అవినాభావ సంబంధాలున్నాయి. మా సోదరుడు కైకాల సత్యనారాయణను రామారావుగారు సొంత తమ్ముడిలా చూసుకునేవారు. నిర్మాతలకు గౌరవం ఇవ్వడంలో అన్నగారి తర్వాత ఆయన వారసుడు బాలకృష్ణ కూడా ముందువరుసలో ఉంటారు. నిర్మాత బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుందని బాలయ్య నమ్ముతారు. అలాంటి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి.’’ అని అన్నారు.

సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి మాట్లాడుతూ..‘‘బాలయ్యతో ఎక్కువ సినిమాలు చేసింది నేనే. 13 సినిమాలు ఆయనతో చేశానంటే ఆయన ఎంత మంచి వాడో అర్థమవుతుంది. అన్నగారి బాటలోనే బాలయ్య కూడా దర్శకులకు ఎంతో గౌరవం ఇస్తారు. 50 ఏళ్లు హీరోగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ ప్రస్థానంలో నేను కూడా ఉండడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ మధ్య ఎక్కడికెళ్లినా జై బాలయ్య అని అంటున్నారు. యూత్ నాడి పట్టుకున్న నటుడు బాలకృష్ణ. రామారావుగారి వారసుడిగా సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్నారు.’’ అని చెప్పారు.

నటుడు మాదాలరవి మాట్లాడుతూ ‘‘నందమూరి బాలకృష్ణగారి 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుకల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా అసోసియేషన్‌లో గర్వించదగ్గ హీరో బాలకృష్ణ గారు. సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేయడమే కాకుండా రాజకీయాల్లోనూ హ్యాట్రిక్ కొట్టి సేవ చేస్తున్నారు. అలాగే క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా కూడా సేవ చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన గొప్ప హీరో బాలకృష్ణ గారికి గోల్డెన్ జూబ్లీ చేయడం ఎంతో గొప్ప విషయం.’’ అని చెప్పారు.

మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీ మాట్లాడుతూ..‘‘నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం. బాలయ్య గారికి కంగ్రాట్స్. ఆ ఈవెంట్ కోసం వేచి చూస్తున్నాం. పెద్దలు ఏం చెప్తే అలా చేస్తాం. ఈవెంట్‌ను విజయవంతం చేయాలని కోరుతున్నా’’ అని అన్నారు.

దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..‘‘బాలకృష్ణ గారి స్వర్ణోత్సవ వేడుకలను ఒక ప్రతిష్టాత్మక వేడుకగా చేస్తున్నాం. సౌతిండియా నుంచి ఎంతోమందిని  ఆహ్వానిస్తున్నాం. ఈ వేడుకను గొప్పగా గుర్తుండిపోయేలా చేస్తాం’’ అని చెప్పారు.

ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్ మాట్లాడుతూ..‘‘సెప్టెంబర్ 1న ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి మీ అందరి సహకారం కావాలని కోరుతున్నా’’ అని చెప్పారు.

సీనియర్ నిర్మాత సీ కల్యాణ్ మాట్లాడుతూ..‘‘మా బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ జరుగుతోందంటే నాకు భయంగా ఉంది. ఆయన సినిమాలు, ఆయన కలెక్షన్స్ అన్నీ రికార్డులకెక్కాయి. ఈ ఫంక్షన్ ఆ రికార్డులన్నింటినీ దాటి ఇంకా గొప్పగా జరగాలనేది నా తాపత్రయం. తప్పకుండా గొప్పగా చేస్తాం. ఇంతకు ముందు ఏ ఫంక్షన్ ఎలా జరిగినా.. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. బాలయ్య గారి మీద అందరికీ ప్రేమ ఉంది. అందరూ తప్పకుండా పాల్గొంటారని ఆశిస్తున్నా. దేశవ్యాప్తంగా అన్ని భాషల నటులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే గొప్ప ఈవెంట్‌గా బాలయ్య గోల్డెన్ జూబ్లీ కార్యక్రమం జరుగుతుంది.’’ అని తెలిపారు.

దర్శకనిర్మాత వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. ‘‘1974 మేలో గుడివాడలో తాతమ్మ కల సినిమా చూశా. అక్కడి నుంచి 50 ఏళ్లు మా కళ్ల ముందు గిర్రున తిరిగి ఇంత దూరం వచ్చేశామా అనేది ఒక కలలా అనిపిస్తోంది. అప్పుడు నేనొక లారీ డ్రైవర్ కొడుకుని. రామారావుగారి అభిమానిని. ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చి ఇలా మీ ముందు మాట్లాడడం ఒక అదృష్టంగా భావిస్తున్నా. నందమూరి బాలకృష్ణ గారికి తల్లిదండ్రులతో పాటు గురువు కూడా ఇంట్లోనే ఉన్నారు. అది ఆయన అదృష్టం. ఇటు సినిమాలతో పాటు అటు రాజకీయాల్లోనూ ఆయన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆయన 50 ఏళ్ల వేడుక అందరికీ స్ఫూర్తిదాయంకంగా ఉండేలా జరగాలని కోరుకుంటున్నా.’’ అని అన్నారు.

తుమ్మల ప్రసన్నకుమార్ మాట్లాడుతూ..‘‘హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ హ్యాట్రిక్ హీరోగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, అలాగే బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి సేవలందరిస్తూ ఉన్న ఏకైక హీరో నందమూరి బాలకృష్ణ. భవిష్యత్తులో ఎవరూ సాధించలేని రికార్డును సృష్టించిన హీరో బాలకృష్ణ. నాలుగు తరాలపాటు రాముడిగా, కృష్ణుడిగా చేసింది ఒక్క నందమూరి కుటుంబమే. సేవారంగంలో బాలకృష్ణగారు ఎన్నో గుప్తదానాలు చేశారు. మదనపల్లెలోని ఒక టీచర్ కుమార్తెకు తన సొంతడబ్బుతో చికిత్స చేయించారు. రాయలసీమలో వరదలు వచ్చినప్పుడు స్పందన కార్యక్రమం చేపట్టారు. ఎన్టీయార్ జోలెపట్టుకుని ఎలా వెళ్లారో.. అలా వారసుడిగా బాలయ్య కూడా చేశారు. అలాంటి బాలయ్య 50 ఏళ్ల వేడుకకు అందరూ హాజరు కావాలి. ఈ వేడుకకు బాలయ్య ముందు ఒప్పుకోలేదు. కానీ ఇదొక స్ఫూర్తిదాయ కార్య్రక్రమంగా ఉంటుందని చెప్పడంతో ఆయన ఒప్పుకున్నారు. ఈ కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అనేలా చేస్తాం’’ అని చెప్పారు.

రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ..‘‘నేను రామారావుగారి అభిమానిని. నేను అభిమానించిన రామారావుగారికి సినిమా రాయడం అనేది మాకు దొరికిన అదృష్టం. 1981లో నేను ఛండశాసనుడు సినిమాకు రాశాను. ఆ టైమ్‌లో ఒక అందమైన కుర్రాడు వచ్చాడు. అతనే బాలకృష్ణ. ఒకొక హీరోకు ఒక్కో బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. అలా బాలయ్యకు డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంది. తొడకొట్టే డైలాగ్ బాలయ్యకే సూట్ అవుతుంది. మేము రాసిన ప్రతి సినిమా బాలయ్యకు సక్సెస్ అయింది. 50 ఏళ్లు పూర్తి చేసుకున్నాడంటే నేను షాకయ్యా. 50 ఏళ్ల వయసు వచ్చిందేమో అనుకున్నా. అన్ని అసోసియేషన్స్ కలుపుకుని బాలయ్య 50 ఏళ్ల వేడకను ప్రపంచానికి తెలిసేలా చేయాలని కోరుతున్నా.’’ అని చెప్పారు.

ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ..‘‘మన ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న బాలకృష్ణగారి కార్యక్రమంలో అన్ని అసోసియేషన్స్ వాళ్లు పాల్గొనడం సంతోషంగా ఉంది. మా అసోసియేషన్ కూడా పాల్గొనడం మా అదృష్టం’’ అని చెప్పారు.

డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ..‘‘50 నిమిషాల పాటు వాక్ చేస్తేనే మనం అలసిపోతాం. అలాంటిది ఆయన 50 ఏళ్లు సినిమాలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి ఆయన కష్టాన్ని గుర్తించి సినిమా పెద్దలందరూ ఒక వేదిక మీదకు వచ్చి ఆయనకు సన్మానం చేయడం చాలా అభినందనీయమైన విషయం. ఈ కార్యక్రమాన్ని చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చేసిన పాత్ర చేయకుండా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు 109 సినిమాలు పూర్తి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఎప్పుడూ ఇలా ఎనర్జిటిక్ గా ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా సెప్టెంబర్ 1న ఘనంగా బాలకృష్ణ గారి నట జీవితానికి నిర్వహించే 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.  (Story : ఘనంగా నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1