ఆగస్టు 15నుంచి రూ.5కే భోజనం
ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
న్యూస్‌తెలుగు/ వినుకొండ : ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం మేరకు ఈ ఆగస్టు 15వ తేదీ నుంచే వినుకొండలో అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నామని, పేదలకు రూ.5కే కడుపునిండా భోజనం అందిస్తామని తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం స్థానిక తల్లి పిల్లల ఆస్పత్రి వద్ద అన్న క్యాంటీన్‌ను ఆయన పరిశీలించారు. భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్, ఐఓటీ పరికరాల ఏర్పాటు గురించీ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోజనం చేసేవారి కోసం టేబుళ్లు, తాగునీటి సౌకర్యం, పంకాలు, విద్యుత్ , రంగుల పనులు తుది దశకు చేరాయన్నారు పూర్తి సౌకర్యాలతో అనుకున్న ప్రకారమే అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తెదేపా గత ప్రభుత్వంలోనే చంద్రబాబు ఈ క్యాంటీన్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షలమంది పేదల ఆకలి తీర్చితే…వాటిని కూడా స్వార్థ, కక్షపూరిత రాజకీయాలకు బలిపెట్టిన దుర్మార్గుడు జగన్ రెడ్డి ఆని ధ్వజమెత్తారు జీవీ. అన్న క్యాంటీన్లకు వైఎస్ ఫొటోలు పెట్టి మరీ వాటిని మూసేశారని, రూ.5కే కడుపునిండా భోజనం తింటున్న పేదల పొట్ట కొట్టి జగన్ తన కడుపు మంట చల్లార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ల తో పాటు చంద్రబాబు ప్రవేశపెట్టిన ఏ సంక్షేమ పథకాన్నీ నాడు కొనసాగించడానికి ఇష్టపడని జగన్ ఎంతోమంది ఉసురు పోసుకున్నారని మండిపడ్డారు జీవీ. అభివృద్ధి విషయంలో కూడా అలానే అన్యాయం చేశారని, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా వదిలేశారని, రాష్ట్రంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ అటకెక్కించారని ధ్వజమెత్తారు. లక్షల కోట్ల అవినీతితో దోచుకోవడం తప్ప జగన్‌రెడ్డి ప్రజలకు మేలు చేసే, ఉపయోగపడే పథకాలన్నీ మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ నడిబొడ్డులో అన్న క్యాంటీన్‌ను మూసివేయడంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయన్నారు. ఆ పరిస్థితిని మార్చుతూ తిరిగి చంద్రన్న పాలన వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో తిరిగి అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నామన్నారు జీవీ ఆంజనేయులు. ఆగస్టు 15న పండగ వాతావరణంలో అన్న క్యాంటీన్లను ప్రారంభించబోతున్నామన్నారు. గతంలో అక్షయపాత్ర వారు గతంలోనూ అన్న క్యాంటీన్లను బాగా నిర్వహించారని, ఆహార నాణ్యతతో పాటు పరిశుభ్రత కూడా చాలా బాగా నిర్వహించారన్నారు. ఈసారి కూడా వారినే బాధ్యత తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో నాణ్యతా ప్రమాణాలతో పౌష్టిక ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. ఈ కార్యక్రమాలు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొనిజేటి నాగశ్రీను రాయల్, టిడిపి నాయకులు షమీంఖాన్, పఠాన అయిబ్ ఖాన్, పత్తి పూర్ణచంద్రరావు, పీవీ సురేష్ బాబు, అజీజ్, కర్నాటి వెంకటరెడ్డి, పల్ల మీసాల దాసయ్య, గంధం సుబ్బారావు,చికెన్ బాబు, గుంజు కాలింగ్ రాజు, పుండ్లు నరసింహారావు, పలువురు టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు. (Story : ఆగస్టు 15నుంచి రూ.5కే భోజనం)