ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలం : సిపిఐ
న్యూస్‌తెలుగు/ వనపర్తి : వనపర్తి ప్రజల సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలమయ్యారని సిపిఐ జిల్లా నేతలు ఆరోపించారు. ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వనపర్తి మున్సిపాలిటీ వద్ద ధర్నా చేశారు. ముందుగా అంబేద్కర్ చౌక్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి జే. రమేష్, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి. కళావతమ్మ, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ మాట్లాడారు. వనపర్తి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురికి కోపంగా తయారైందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రోడ్ల విస్తరణ అసంపూర్తిగా ఉందన్నారు. పూర్తి చేయాలని కోరారు. పట్టణంలో పార్కు స్థలాలు అన్యాక్రాంతమయ్యాయని విచారణ చేసి స్వాధీనం చేసుకొని అభివృద్ధి చేయాలన్నారు. పట్టణ ప్రజలకు పందులు, కోతులు, వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉందన్నారు. వీధి కుక్కల నియంత్రణ (పునరుత్పత్తి నివారణ కేంద్రం) కోసం లక్షల వ్యక్తించి కట్టినా నిరుపయోగంగా ఉందని, పని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గతంలో విలీనమైన మెట్టుపల్లి, రంగం గడ్డ, నందిమల్లగడ్డ, వశ్య నాయక్ తాండ ను విలీనం చేశారని, దశాబ్దాలు గడిచిన కనీస వసతులు కల్పించలేదన్నారు. తాజాగా గత మున్సిపల్ ఎన్నికల ముందు వనపర్తి సమీపంలోని రాజనగరం, నాగవరం, శ్రీనివాసపూర్, మర్రికుంట, నర్సింగాయి పల్లి లను మున్సిపాలిటీలో విలీనం చేశారని ఐదేళ్లు కావస్తున్న వాటికి రోడ్లు, డ్రైన్లు, తాగునీటి లైన్లు వంటి మౌలిక వసతులు కల్పించలేదన్నారు. వనపర్తి పాత పట్టణంలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉందన్నారు.పీర్లగుట్ట, చిట్యాల రోడ్డులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలకు రోడ్లు, తాగునీరు, వీధిలైట్లు కనీసం వసతులు లేవని, కల్పించాలన్నారు. మున్సిపల్ కమిషనర్ పూర్ణచంద్రరావుకు వినతిపత్రం సమస్యలను దృష్టికి తెచ్చి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్పందించిన కమిషనర్ పార్కు స్థలాలను అన్యాక్రాంతం కాకుండా వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. అన్యాక్రాంతమైన వాటిపై విచారణ చేయిస్తామన్నారు. కుక్కల పునరుత్పత్తి నివారణ కేంద్రాన్ని వెంటనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. రోడ్డు ,డ్రైనేజీలు, పైపులైన్ల నిర్మాణం నిధులతో ముడిపడ్డ అంశమని కౌన్సిల్లో పెట్టి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. సిపిఐ నాయకులు నాగన్న,శాంతన్న, చిలుక కృష్ణయ్య,ఎత్తం మహేష్,వంశీ,జయమ్మ ,చంద్రశేఖర్,నజీర్,లింగస్వామి,శాంతన్న,వెంకటేశ్వర్లు,బాలయ్య, స్వామి,ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రజా సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలం : సిపిఐ)