రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయాలి
సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు.
న్యూస్‌తెలుగు/విజయనగరం: విజయనగరం రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఆయన చాంబర్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రెవెన్యూ వసూళ్ల పనితీరు, పురోగతిపై చర్చించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మిగిలి ఉన్న అన్ని బకాయిలను వసూలు చేసే విధంగా కృషి చేయాలన్నారు. కొత్తగా ఆస్తి పన్ను విధింపు విషయంలో కూడా నిర్లక్ష్యం వద్దని సూచించారు. ఇంకా పన్ను విధింపులేని ఆస్తులు, ఖాళీ స్థలాల వివరాలను యుద్ధ ప్రాతిపదికన సేకరించి అవసరమైన పన్ను విధింపు జరిగే విధంగా చూడాలన్నారు. నగరపాలక సంస్థ ఆధీనంలో ఉన్న షాపుల అద్దె బకాయిలను కూడా వెనువెంటనే వసూలు చేయాలని చెప్పారు. దీర్ఘకాలికంగా ఉన్న బకాయిలను ఉపేక్షించవద్దని తెలిపారు. నోటీసులు జారీ చేసినప్పటికి స్పందించకుంటే షాపులు సీజ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు కిరణ్, వినోద్, సాయి కిరణ్ పాల్గొన్నారు. (Story : రెవెన్యూ వసూళ్లను వేగవంతం చేయాలి)