జిల్లాకు మరో 480 మెట్రిక్ టన్నుల డిఏపి ఎరువుల రాక
38 రైతుసేవా కేంద్రాలకు పంపిణీకి ఏర్పాట్లు
జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు
న్యూస్‌తెలుగు/విజయనగరం ;జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజనులో రైతులకు పంపిణీ చేసే నిమిత్తం 480 మెట్రిక్ టన్నుల డిఏపి ఎరువులతో కూడిన గూడ్సు రైలు వ్యాగన్ క్రిభ్‌కో కంపెనీ నుంచి జిల్లాకు చేరుకున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి వి.టి.రామారావు తెలిపారు. యీ ఎరువులను ఇప్పటికే ఇండెంట్ పెట్టిన జిల్లాలోని 38 రైతుసేవా కేంద్రాలకు సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు మార్క్ ఫెడ్ మేనేజర్ విమలకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. నగరంలోని గూడ్సు షెడ్ కు వచ్చిన డిఏపి రేక్‌ను ఆయన జిల్లా మార్కుఫెడ్ మేనేజర్‌తో కలసి ఆదివారం పరిశీలించి, రైలు వ్యాగన్ నుంచి లారీల ద్వారా తరలించే ఏర్పాట్లను పర్యవేక్షించారు. యీ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రైతుసేవా కేంద్రాలకు డిఏపి, యూరియా పంపించడం జరిగిందన్నారు. రైతుసేవా కేంద్రాల్లో గానీ, ప్రైవేటు డీలర్ల వద్ద గానీ అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే వెంటనే సంబంధిత రైతులు మండల వ్యవసాయ అధికారికి తెలియజేయాలని కోరారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు నాగభూషణం, మండల వ్యవసాయ అధికారి ఉమామహేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు. (Story : జిల్లాకు మరో 480 మెట్రిక్ టన్నుల డిఏపి ఎరువుల రాక)