గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు ప్రత్యేక బృందం
విజయనగరం జిల్లా ఎస్సీ వకుల్ జిందల్
న్యూస్‌తెలుగు/విజయనగరం: జిల్లాలో గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు అన్ని రకాలైన కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు వచ్చే అన్ని రహదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసామన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆకస్మికంగా వాహన తనిఖీలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, వాహన తనిఖీలను ఒకే ప్రాంతంలో కాకుండా రోజూ వేరు వేరు ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టాలని, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతోపాటు, వాహనాల రికార్డులను పరిశీలించాలని, నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు ఈ- చలానాలు విధించాలన్నారు. గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు, గంజాయి సేవించే వారిని అదుపులోకి తీసుకొనేందుకు, వారికి గంజాయి సరఫరా చేసే వ్యాపారులను గుర్తించేందుకు, వారు ఎవరి వద్ద నుండి పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారన్న విషయాలను రాబట్టేందుకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని నియమించామన్నారు. ఈ బృందాలు జిల్లాలో ముందుగా గుర్తించిన ప్రాంతాల్లో దాడులు నిర్వహించి, గంజాయి సేవించి, అల్లర్లుకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకొని, వారిపై చట్టపరమైన తదుపరి చర్యలు చేపట్టేందుకు స్థానిక పోలీసులకు అప్పగిస్తారన్నారు. అంతేకాకుండా, వారికి గంజాయి సరఫరా చేస్తున్న చిన్న వ్యాపారులను, వారికి పెద్ద మొత్తంలో విక్రయించే పెద్ద వ్యాపారులను, వారికి గంజాయిని విక్రయించే వ్యక్తులను గుర్తించి, గంజాయి అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా ఈ ప్రత్యేక బృందం పని చేస్తుందన్నారు. గంజాయి అక్రమ రవాణకు పాల్పడే వ్యక్తులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవన్నారు. గంజాయి అక్రమ రవాణ, సేవించడం, విక్రయాలు జరిపేనిందితులుపదే పదే నేరాలకు పాల్పడి, పట్టుబడితే వారిపై పి.డి. చట్టం ప్రయోగిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. విజయనగరం పట్టణంలో ఆర్టీసి కాంప్లెక్స్, గూడ్సు షెడ్, రైల్వే స్టేషను ప్రాంతాల్లో ఇప్పటికే నిఘా పెట్టామన్నారు. విజయనగరం 1వ పట్టణ పరిధిలో గంజాయి అక్రమంగా కలిగిన మండల శాంతి, మస్తానీ, బొంతు వెంకటేశ్వరరావు, బాబూసింగ్, అలజంగి ప్రసాద్ అనే ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుండి 8కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అరెస్టు కాబడిన నిందితులందరికీ గంజాయి సేవించే అలవాటు కలదని, వీరు ట్రెయిన్స్ లో తిరుగుతూ, ఒడిస్సా రాష్ట్రం రాయఘడ, పర్లాకిమిడి, బరంపురం వంటి ప్రాంతాల్లో కొద్ది మొత్తంలో గంజాయి కొనుగోలు చేసి, వాటిని చిన్న పొట్లాలుగా చేసి, పట్టణంలో గంజాయి అలవాటు ఉన్న వ్యక్తులకు రూ. 100/- లేదా రూ.200/- లకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించామన్నారు. అదే విధంగా గూడ్సు షెడ్ ప్రాంతంలో గంజాయి సేవించిన మరో 8మందిని కూడా అదుపులోకి తీసుకొని, రిమాండుకు తరలించామన్నారు. గంజాయి సేవించినా, విక్రయించినా, అక్రమ రవాణకు పాల్పడినా వారిపై ఎన్.డి.పి.ఎస్. చట్టం క్రింద కేసులు నమోదు చెయ్యాలని అధికారులకు జిల్లా ఎస్పీఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గంజాయి గురించిన సమాచారాన్ని టాస్క్ ఫోర్స్ సిఐ ఫోను నంబరుకు 9121109416కు అందించాలని ప్రజలను కోరారు. (Story: గంజాయి అక్రమ రవాణ నియంత్రణకు ప్రత్యేక బృందం)