ప్రజల ఫిర్యాదులపై పవన్ కళ్యాణ్ అలెర్ట్!
• వెంకటగిరిలో మహిళలను, వృద్ధులను వేధిస్తున్న ముఠాలపై వచ్చిన ఫిర్యాదుకు స్పందించి తిరుపతి ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్
• గంటల వ్యవధిలో స్పందించిన పోలీసు యంత్రాంగం… కేసులు నమోదు చేసి బైండోవర్
న్యూస్‌తెలుగు/అమరావతి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ – తన కార్యాలయానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను, ఫిర్యాదులను శనివారం ఉదయం నుంచీ పరిశీలిస్తున్నారు. తన కార్యాలయ సిబ్బందితో కలసి ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి అర్జీని క్షుణ్ణంగా చదువుతున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతోపాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను, ఎదురవుతున్న ఇబ్బందులను ఫిర్యాదుల రూపంలో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. తన శాఖల పరిధిలోని ప్రతి అంశాన్నీ అధికారులతో మాట్లాడి నిర్దేశిత వ్యవధిలో పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలు, ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ, 6వ వార్డు, ఫస్ట్ లేన్ నుంచి మహిళలు, వృద్ధులు తెలియచేసిన సమస్య పవన్ కళ్యాణ్ ని కదిలించింది. ముఠాలుగా ఏర్పడిన కొందరు యువకులు బైక్స్ పై ప్రమాదకరంగా, వేగంగా వీధుల్లో సంచరిస్తూ విద్యార్థినులను, యువతులను, మహిళలను వేధిస్తున్నారని… వృద్ధులను భయపెడుతున్నారని లేఖ రాశారు. అదే విధంగా యువతుల ఫోటోలు తీసి ఇంటర్నెట్లో ఉంచి.. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, మద్యం తాగి ఇళ్ల ముందు భారీ శబ్దాలు చేస్తూ పాటలుపెట్టడం, ఇళ్లపై రాళ్ళు వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. సదరు యువకులు వివరాలు, బైక్స్ పై వేగంగా సంచరిస్తున్న ఫోటోలను, వాహనాల నంబర్లను సైతం తమ ఫిర్యాదుకు జత చేశారు. ఆ యువకులను పట్టుకొని హెచ్చరిస్తే ప్రధాన రహదారికి వస్తే దాడి చేస్తామని బెదిరించారని వాపోయారు. ఆ యువకులు ఒక మహిళా ఎస్సైను సైతం వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించి తిరుపతి ఎస్.పి.సుబ్బరాయుడు తో మాట్లాడారు. వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీ నుంచి వచ్చిన సమస్యను తక్షణమే పరిష్కరించాలి అన్నారు. ఆడ పిల్లలను, మహిళలను వేధించేవారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ సమస్యపై వెంటనే దృష్టి సారిస్తామని తగు చర్యలు తీసుకొంటామని తిరుపతి ఎస్పీ గారు తెలిపారు.
• పోలీసుల తక్షణ స్పందన
పవన్ కళ్యాణ్ తెలిపిన అంశంపై తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు స్పందించి సంబంధిత డివిజన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళి అక్కడి ప్రజలతో మాట్లాడి… వారిని వేధిస్తూ ఇబ్బందిపెడుతున్న వారి వివరాలు నమోదు చేసుకున్నారు. బైక్స్ పై మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా సంచరిస్తూ వేధిస్తున్నవారిని పట్టుకొని కేసులు నమోదు చేసి బైండోవర్ చేశారు. (Story: ప్రజల ఫిర్యాదులపై పవన్ కళ్యాణ్ అలెర్ట్!)