పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి: గురువారం ఉదయాన్నే వనపర్తి, పాన్గల్ మండలాల్లో పర్యటించి పరిసరాల పరిశుభ్రత, పారిశుధ్యం, అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, పాటశాల విద్యార్థులతో మాట్లాడి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. ఉదయాన్నే వనపర్తి మున్సిపాలిటీలోని 10 వ వార్డులో తిరిగి డ్రైన్ ల పరిస్థితి పరిశీలించారు. ఖాళీ ప్లేట్లలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను ప్లాటు యజమానులు తొలగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని, యజమానులు శుభ్రం చేయని పక్షంలో మున్సిపాలిటీ ద్వారా శుభ్రం చేయించి యజమాని పై జరిమాన విధించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. డ్రైన్ లు ఎప్పటి కప్పుడు శుభ్రం చేస్తూ నీరు సాఫీగా వెళ్లే విధంగా చూసుకోవాలని సూచించారు. గోప్లాపూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అదే గ్రామంలో నర్సరీ ని సందర్శించి వన మహోత్సవ కార్యక్రమానికి ఉపయోగిస్తున్న మొక్కలను పరిశీలించారు.
రెమద్దుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలను సందర్శించిన ఆయన అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించడమే కాకుండా విద్యార్థులతో ముచ్చటించారు. బోధిస్తున్న మాధ్యమం పై వివరాలు తెలుసుకొని విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు.
అనంతరం పాన్గల్ మండలంలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ఎంతమంది ఒ.పి లు వచ్చారు అనేది రిజిస్టర్ లు పరిశీలించారు. పి హెచ్ సి లో ఉన్న మందుల నిలువలు, సమస్యల పై ఆరా తీశారు. కస్తూర్బా పాఠశాలను సందర్శించి మౌలిక సదుపాయాల మరమ్మతు పనులను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పానగల్ తహసిల్దార్ కార్యాలయంలో సందర్శించి ధరణి దరఖాస్తుల పరిష్కారం పై వివరాలు తీసుకున్నారు. త్వరగా పరిష్కరించి ఆర్డీఓ లాగిన్ కు పంపించాలని తహసిల్దార్ ను ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి, పానగల్ తహసిల్దార్, ఎంపీడీఓ తదితరులు కలెక్టర్ వెంట పాల్గొన్నారు. (Story : పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి)