మధుసూదన్‌రావు గుర్తుపెట్టుకో
ఎల్లకాలం అధికారం ఉండదు
పోలీసు అధికారికి వైఎస్ జగన్ హెచ్చరిక
న్యూస్ తెలుగు/అమరావతి: ‘మధుసూదన్ రావ్ గుర్తుపెట్టుకో..ఎల్లకాలం ఇదే మాదిరిగా ఉండదు.. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామని అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడంకాదని పోలీసుల తీరుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లు లాక్కుని, చింపే అధికారం ఎవరిచ్చారంటూ సూటిగా ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవ్వగా, తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నరు జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెడలో నల్ల కండువాలు వేసుకుని..రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలంటూ అసెంబ్లీకి బయల్దేరారు. ఈ సమయంలో అసెంబ్లీ గేట్ వద్ద ప్లకార్డులను, పేపర్లను పోలీసులు చించివేయడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా స్వామ్యాన్ని కాపాడటమే మీ టోపీలపై ఉన్న సింహాలకు అర్థమని సూచించారు. ఈ సమయంలో మధుసూదన్ రావు అనే పోలీసు అధికారిని ఉద్దేశించి జగన్ గట్టిగా హెచ్చరించారు. (Story : మధుసూదన్‌రావు గుర్తుపెట్టుకో ఎల్లకాలం అధికారం ఉండదు)