నల్ల కండువాలతో అసెంబ్లీకి జగన్
గవర్నరు ప్రసంగంలో వైసీపీ సభ్యుల నిరసన
శాంతిభద్రతలు పరిరక్షించాలని నినాదాలు
న్యూస్ తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండవాలతో హాజరై నిరసన తెలిపారు. రాష్ట్ర గవర్నరు జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగ సమయంలో వైసీపీ సభ్యులు అడుగడుగునా నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, సేవ్ డెమోక్రసీ అంటూ ప్లకార్డులతో నినదించారు. తొలుత వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణం సమీపానికి వైఎస్ జగన్‌తోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకుని, సభ్యులందరూ ఒకే సారి అసెంబ్లీలోకి వెళ్లారు. ఈ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతిలో ఉన్న ప్లకార్డులను పోలీసులు లాక్కుని చించివేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుపై జగన్‌తోపాటు పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో ఈనెల 24వ తేదీ బుధవారం దిల్లీలో జగన్ ధర్నా నిర్వహించనున్నారు. దీనికి హాజరయ్యేందుకుగాను పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మంగళవారం సాయంత్రానికి దిల్లీకి చేరుకోనున్నారు. (Story : నల్ల కండువాలతో అసెంబ్లీకి జగన్)