టోల్‌గేట్‌ను తరలించాలి
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి మంత్రి కొండపల్లి లేఖ
న్యూస్‌తెలుగు/విజయనగరం:జొన్నాడ సమీపంలోని బోడమెట్టపాలెం వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్‌ను బైపాస్ రోడ్డులోకి మార్చాలని, కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీకి, రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ లేఖ రాశారు. ఈ టోల్‌గేట్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వాహనదారులకు పెను భారంగా మారిందని పేర్కొన్నారు. టోల్‌గేట్ ఏర్పాటు చేసేముందు తీసుకోవాల్సిన చర్యలను చేపట్టలేదని, నిబంధనలను పాటించలేదని పేర్కొన్నారు. రాయపూర్-విశాఖపట్నం 26 వ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-.43)పై మోదవలస నుంచి గొట్లాం వరకు రోడ్డును విస్తరించి, నాలుగు లేన్ల రహదారిగా నిర్మాణం పూర్తిచేసి, దాదాపు ఐదేళ్ల క్రితమే వినియోగంలోకి తెచ్చారని తెలిపారు. ఇప్పుడు ఈ రోడ్డుపై కొత్తగా టోల్‌ప్లాజాను ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్దమని పేర్కొన్నారు. వాస్తవానికి వినియోగంలోకి వచ్చిన 45 రోజుల్లోనే టోల్‌ప్లాజాను ఏర్పాటు చేసి రుసుం వసూలు చేయాల్సి ఉందని, కానీ వినియోగంలోకి వచ్చిన ఐదేళ్ల తరువాత ఇక్కడ టోల్‌ప్లాజాను ఏర్పాటు చేసి, ఈ నెల 2 వ తేదీ నుంచి వసూళ్లు మొదలు పెట్టారని వివరించారు. సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఈ టోల్‌ప్లాజాను, కొత్తగా నిర్మించిన విజయనగరం బైపాస్ రోడ్డులోకి తరలించాలని మంత్రి కొండపల్లి కోరారు. (Story : టోల్‌గేట్‌ను తరలించాలి)