సీజనల్ వ్యాధులతో ఏ ఒక్కరూ మరణించకూడదు
గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కలిగించాలి
జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్
న్యూస్‌తెలుగు/విజయనగరం : జిల్లాలో సీజనల్ వ్యాధుల వలన ఏ ఒక్కరూ మరణించకూడదని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. ఈ విషయం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియం లో సీజనల్ వ్యాధులు, పారిశుధ్యం పై ఎం.పి.డి.ఓ లు, మెడికల్ అధికారులు, ఈ.ఓ.పి.ఆర్.డి లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఓ పి ఆర్ డి లు రెండు రోజుల్లో పంచాయతి కార్యదర్శులతో గ్రామాల వారీగా సమీక్షించి పారిశుధ్యం మెరుగుదలకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గతవారం జరిగిన గ్రామ సందర్శన లో పారిశుధ్యం పైనే ఎక్కువ ఫిర్యాదులు అందాయని, వచ్చే గ్రామ సందర్శన నాటికి వాటన్నిటినీ పరిష్కరించాలని ఆదేశించారు. ఎవరైనా నోడల్ అధికారి ఏ కార్యదర్శి పైన ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో పర్యటించి వర్షాకాలం అయినందున పైప్ లీకేజీలను గుర్తించి బాగు చేయడం, నీటి నిల్వలు లేకుండా చూడడం వంటి పనులు తక్షణమే జరగాలని తెలిపారు.
డెంగు, మలేరియా వంటి వ్యాధులు ప్రబల కుండ ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. మండల స్థాయి లో మెడికల్ అధికారులు, ఎం పి డి ఓ లు, ఈ ఓ పి ఆర్ డి లు సమీక్షించాలని, గ్రామ స్థాయి లో అమలు జరపాలని గ్రామ స్థాయి లో సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి గ్రామం లో విస్తృతంగా అవగాహన కలిగించాలని అన్నారు. ఏయే వ్యాధులు ఎలా వస్తాయి, రాకుండా ఉండాలంటే ఏమేం చేయాలి, వస్తే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి, ఎలా ఎదుర్కొనాలి అనే అంశాల పై స్పష్టంగా వివరించాలని తెలిపారు. మండల స్థాయి అధికారులు క్షేత్ర స్థాయి సందర్శనలు చేయాలని, అప్పుడే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో శత శాతం ప్రసవాలు జరిగేల వైద్యులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నిరకాల వసతులు, సౌకర్యాలు, వైద్యులు ఉన్నప్పటికీ ప్రైవేటు ఆసుపత్రులకు ఎందుకు వెళ్తున్నారని వైద్యుల్ని ప్రశ్నించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రైవేటు ఆసుపత్రులకు, విశాఖపట్నం కు వెళ్ళకుండా వారిని చూసుకోవాలని, వైద్యులు నమ్మకం కలిగించేలా పని చేస్తే బయటకు వెళ్ళరని తెలిపారు.
ఈ సమావేశం లో డి.ఎం.హెచ్.ఓ డా.భాస్కర రావు మాట్లాడుతూ వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తామని, డి.సి.హెచ్ ఎస్ డా.గౌరీ శంకర రావు మాట్లాడుతూ ఇన్స్టిట్యూషనల్ డెలివరీలను పెంచుతామని తెలిపారు. డి.పి.ఓ శ్రీధర్ రాజామాట్లాడుతూ క్లోరినేషన్ చేసి, సానిటేషన్ డ్రైవ్ ను నిర్వహించి , డ్రై డే లను పాటించడం ద్వారా పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తామని తెలిపారు. (Story : సీజనల్ వ్యాధులతో ఏ ఒక్కరూ మరణించకూడదు)