కాలువల్లో పేరుకుపోయిన పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలి
కమిషనర్ ఎం ఎం నాయుడు
న్యూస్‌తెలుగు/విజయనగరం :కాలువల్లో పేరుకుపోయిన పూడికను యుద్ధ ప్రాతిపదికన తొలగించి వేయాలని ప్రజారోగ్య సిబ్బందికి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం ఎం నాయుడు ఆదేశించారు. స్థానిక 25వ డివిజన్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో కాలువలలో పూడిక చేరి ఇబ్బందికరంగా మారిందన్న ఫిర్యాదు మేరకు ఇంజనీరింగ్, ప్రజారోగ్య సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు. రైల్వే స్టేషన్, వనంగుడి ప్రాంతంలో ఉన్న కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాలను తక్షణం తొలగించాలని అక్కడ ఉన్న సిబ్బందికి సూచించారు. అలాగే కాలువలో చెత్తాచెదారం పేరుకు పోయినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కార్యదర్శి పై మండిపడ్డారు. ప్రతిరోజు తమ సచివాలయ పరిధిలో ఉన్న కాలువలు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న దుకాణదారులు కూడా చెత్తాచెదారాలను డస్ట్ బిన్ లో మాత్రమే వేయాలని చెప్పారు. కాలువల్లో చెత్తలు వేసినట్లు గమనిస్తే అపరాధ రుసుమును వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎం ఎం నాయుడు మాట్లాడుతూ వర్షాలు కురుస్తున్న సమయంలో కాలువల ద్వారా వర్షపు నీరు సజావుగా ప్రవహించే విధంగా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. అయితే కొన్నిచోట్ల కాలువల్లో చెత్తాచెదారాలు వేయడంతో పూడిక పేరుకుపోయి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. వాటిని తక్షణమే ప్రక్షాళన చేసే విధంగా సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ కే శ్రీనివాసరావు, డి ఈ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. (Story : కాలువల్లో పేరుకుపోయిన పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలి)