ప్రతి పిల్లవానిపైన పర్యవేక్షణ ఉండాలి
డ్రాపౌట్ల తోనే అనర్ధాలు
రాష్ట్ర బాలల హక్కుల చైర్మన్ కేసలి అప్పా రావు
న్యూస్‌తెలుగు/ విజయనగరం : విజయనగరం, పిల్లల ప్రవర్తన పై తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని రాష్ట్ర బాలల హక్కుల చైర్మన్ కేసలి అప్పా రావు తెలిపారు. సోషల్ మీడియా ప్రభావం వలన ప్రస్తుతం తల్లిదండ్రులతో పిల్లలకు దూరం పెరిగిపోతుందని, పిల్లలు ఏం చేస్తున్నారో కనిపెట్టలేక పోతున్నారని పెర్కొన్నారు. బాలల పట్ల మాదక ద్రవ్యాలు, మత్తు పదార్ధాల నిరోధం పై జాయింట్ ఏక్షన్ ప్లాన్ అమలు పై జిల్లా అధికారులతో మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ మత్తు పదార్ధాల నిరోధానికి శాఖల వారీగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసి అమలు చేయాలని, జిల్లా అధికారులు తమ సలహాలు, సూచనలను అందజేస్తే ప్రభుత్వానికి సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు. 3 నెలల తర్వాత వాటి ఫలితాలను మరోసారి చర్చించుకొని అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం తో చర్చించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పంచాయతి స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఈ విషయం పై చర్చ జరగాల్సిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. గ్రామీణ స్థాయి లో డి.ఆర్.డి ఎ, మెప్మా ఆధ్వర్యం లో జరుగుతున్న డ్వాక్రా సమావేశాలలో మత్తు పదార్ధాల వలన కలిగే అనర్ధాల పై ఎజెండా గా చేర్చి చర్చ జరగాలన్నారు. హార్డింగ్ ల ద్వారా విస్తృత ప్రచారం జరగాలని, మున్సిపల్, పంచాయతి, విద్యా శాఖలు కీలకంగా వ్యవహరించాలని తెలిపారు.
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు గోండు సీతారాం మాట్లాడుతూ ప్రధానంగా పాఠశాలల్లో డ్రాప్ అవుట్ల వల్లనే అనేక అనర్ధాలు జరుగుతున్నాయని చదువు మానేసి స్వేచ్చగా తిరుగుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని విద్యా శాఖాధికారి డ్రాప్ అవుట్ల ను తగ్గించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు పేరెంట్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని, బడికి రాని పిల్లల పై ప్రత్యెక దృష్టి పెట్టాలని సూచించారు. వసతి గృహాలలో ఉంటున్న విద్యార్ధుల పై కన్నేసి ఉంచాలని, మద్యం, గంజాయి వంటి పదార్ధాలను విక్రయించకుండా చుట్టూ ప్రక్కల గట్టి తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. ముఖ్యంగా అర్బన్ లో గంజాయి, మత్తు పదార్ధాల విక్రయాలు బెగ్గింగ్ ముసుగులో జరుగుతున్నాయని, వీరి పట్ల అప్రమతంగా ఉండాలని సూచించారు. పోలీస్, మున్సిపల్ కమిషనర్లు దృష్టి పెట్టాలని అన్నారు.
ఈ సమావేశం లో ఇంచార్జ్ డి.ఆర్.ఓ సుమబాల, బాల సంక్షేమ కమిటి ఛైర్పర్సన్ హిమబిందు, ఐ.సి.డి.ఎస్ పి.డి శాంతకుమారి, డి.ఆర్.డి.ఎ , మెప్మా పి.డి లు కళ్యాణ చక్రవర్తి, సుధాకర రావు, డి.ఎం.హెచ్ ఓ డా.భాస్కర రావు, డి.ఈ.ఓ ప్రేమ కుమార్, పంచాయతి అధికారి శ్రీధర్ రాజ, డిస్ట్రిక్ట్ బి సి వెల్ఫేర్ అధికారి సందీప్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ అధికారి శరత్ కుమార్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. (Story : ప్రతి పిల్లవానిపైన పర్యవేక్షణ ఉండాలి)