డ్రగ్స్ రహిత జిల్లాగా రూపొందించాలి
పిల్లల్లో డ్రగ్స్ వినియోగం నియంత్రణపై దృష్టి సారించాలి
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ కేశలి అప్పారావు
న్యూస్‌తెలుగు/ విజయనగరం : పిల్లలు, యువతలో డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించడం ద్వారా జిల్లాను డ్రగ్స్, మత్తుపదార్ధాల రహితంగా రూపొందించే దిశగా అధికారులంతా కృషిచేయాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్‌పర్సన్ కేసలి అప్పారావు కోరారు. పిల్లల్లో డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు జిల్లా స్థాయిలో సంయుక్త కార్యాచారణ రూపొందించేందుకు జిల్లా స్థాయి కమిటీ సమావేశం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఛైర్మన్ అధ్యక్షతన మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యీ సమావేశంలో బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యులు గొండు సీతారాం, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ హిమబిందు, జిల్లా అధికారులు పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా డ్రగ్స్ నియంత్రణకు జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్బంగా ఛైర్మన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ పిల్లల వ్యవహారశైలి, నడవడికను ఇంటివద్ద వారి తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిరంతరం గమనిస్తూ వుండాలని, వారు అసాధారణంగా వ్యవహరించినట్లయితే వారి ప్రవర్తనలో ఏమైనా మార్పలు గమనిస్తే వెంటనే అప్రమత్తం కావలసి వుందన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగం అధికంగా వుంటోందని, ఇక్కడ హాస్టళ్లలో వుంటున్న విద్యార్ధులు, యువతపై నిఘా వుంచాలన్నారు. డ్రగ్స్ కు బదులుగా మత్తు ఇచ్చే ఔషధాలను మెడికల్ షాపుల్లో విక్రయిస్తున్నట్టు తెలుస్తోందని అటువంటి ఔషధాలు డాక్టర్ల సిఫారసు లేకుండా విక్రయించకుండా చూడాలని డ్రగ్స్ కంట్రోల్ అధికారులకు సూచించారు.
పిల్లల్లో మార్పు తీసుకురాగలిగే శక్తి ఉపాధ్యాయులకే వుంటుందని అందువల్ల వారు పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించి వారి ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేలా కృషిచేయాలని కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు.
ఆరోగ్యకరమైన యువతీయువకులు వుంటేనే ఆరోగ్యకరమైన సమాజం రూపొందుతుందని అందువల్ల పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం డ్రగ్స్‌కు వారు దూరంగా వుండేటా చూసే బాధ్యత అందరిపై వుందని జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం అధ్యక్షురాలు హిమబిందు అన్నారు. aa
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి సుమబాల, పోలీసు, ఎక్సైజ్, విద్యా, వైద్య శాఖల అధికారులు, డి.ఆర్.డి.ఏ., మెప్మా, పంచాయతీరాజ్ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. (Story : డ్రగ్స్ రహిత జిల్లాగా రూపొందించాలి)