లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చర్యలు
విజయనగరం నగరపాలక కమిషనర్ ఎం ఎం నాయుడు
న్యూస్ తెలుగు/విజయనగరం: లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి నగరపాలక సంస్థ కమిషనర్ ఎం ఎం నాయుడు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం 24 వ డివిజన్ ప్రాంతంలో పర్యటించి అక్కడ నెలకొన్న సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా అక్కడ ఉన్న ప్రధాన కాలువలో నీరు ప్రవహించ నిలిచిపోవడంతో మురుగనీరు రోడ్లపైకి రావడానికి గమనించారు. తక్షణం సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు. అలాగే సమస్య తీవ్రతరం అవుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన శానిటరీ కార్యదర్శి, పారిశుధ్య సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నిర్లక్ష్య ధోరణి పునరావృతం అయితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. స్థానిక కార్పొరేటర్ కంటుభుక్త తవిటిరాజు కాలువ తీవ్రతను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. తక్షణమే కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాలను తొలగించి నీరు ప్రవహించే విధంగా చేస్తామని కమిషనర్ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా ముందస్తుగా గుర్తించి వాటిని సరిచేయాలని అన్నారు. రాబోయే రోజుల్లో కురిసే వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, ప్రధాన కాలువలు చెత్తలతో పేరుకుపోవడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అన్నారు.వర్షపు నీరు అధికమైన పరిస్థితుల్లో ముంపు ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు. కావున వాటిని తక్షణమే గుర్తించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించామన్నారు. వీధులలోని కాలువలలో మురుగు నిలిచిపోకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామన్నారు. (Story: లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా చర్యలు)