ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం!
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. ఐదు స్థానాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గురువారంనాడు జరిగింది. సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిగింది. ఏడు స్థానాల్లో ముందుగా ఐదు స్థానాలు వైసీపీకి, ఒక స్థానం టీడీపీకి దక్కాయి. అనూహ్యంగా ఇంకో స్థానం ‘టై’ అయింది. వాస్తవానికి, ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలూ పాలక వైసీపీనే గెలవాల్సింది. కానీ అనూహ్యమైన రీతిలో టీడీపీకి చెందిన అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించడంతో వైసీపీకి చెందిన ఒక అభ్యర్థి ఎనిమిదోస్థానంలో వుండిపోవాల్సి వచ్చింది. టీడీపీ గెలవడం రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైన అంశంగా పరిగణిస్తున్నారు. ఇటీవల జరిగిన మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడిరటినీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. అప్పటివరకు ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల అంతగా ఆసక్తి చూపని టీడీపీ పట్టభద్రుల ఎన్నికల ఫలితాలతో ఆత్మవిశ్వాసం పెరిగింది. వెంటనే ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలపై గట్టిగానే దృష్టిపెట్టింది. తన సభ్యులందరికీ విప్ జారీ చేసింది. సభలో ప్రస్తుతానికి 19 ఓట్లు మాత్రమే టీడీపీకి వున్నాయి. టీడీపీ అభ్యర్థి గెలవడానికి 23 ఓట్లు అవసరం. వైసీపీ పట్ల అసంతృప్తితో వున్న ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు టీడీపీకి ఓట్లు వేసినట్లుగా భావిస్తున్నారు. వీరిద్దరు పోగా, మరో రెండు ఓట్లు ఎలా వచ్చాయన్నదే చర్చనీయాంశంగా మారింది. గతంలో టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిపోయిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు తిరిగి టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నట్లుగా సమాచారం. ఆ ఇద్దరే ఇప్పుడు ఈ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేశారా? అన్న అనుమానం కలుగుతోంది. లేదా వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగిందా? అన్న సందేహాలూ కలుగుతున్నాయి. అంతేగాకుండా, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు టీడీపీ పట్ల కాస్త పాజిటివ్‌గా వున్నట్లు సమాచారం. బహుశా ఆయనే తెగించి టీడీపీకి ఓటు వేశారా అన్న సందేహం కూడా కలుగుతోంది. ఏదేమైనప్పటికీ, ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడటం ఒక విధంగా పాలక వైసీపీకి ఎదురుదెబ్బగానే పరిగణించవచ్చు. టీడీపీకి ఇది సానుకూల ఫలితం. ఇక టీడీపీ నుంచి గెలుపొందిన పంచుమర్తి అనురాధకు ఇది లక్కీఛాన్స్‌గానే భావించవచ్చు. ఎందుకంటే, ఆమెను నామ్‌కే వాస్తేగానే అభ్యర్థిగా ప్రకటించారు. ఈస్థాయిలో గెలుపు వుంటుందంటే, టీడీపీ నుంచి కనీసం పది మంది ఈ స్థానం కోసం పోటీపడేవారు. (Story: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితం!)