ఉత్తర కొరియాపై అగ్రరాజ్యం కన్నేసిందా?
సియోల్ : ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి కారణం అమెరికా, దాని నాయకత్వంలోని ‘నాటో’ అని అందరికీ తెల్సిందే. ఇప్పుడు ఉత్తర కొరియాను కూడా ఏదో ఒకటి చేయాలని అగ్రరాజ్యం అమెరికా తపిస్తోంది. ఈ దిశగా దక్షిణ కొరియాను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది. తాజాగా దక్షిణ కొరియా కొత్త అధినేత చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఉత్తర కొరియా విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రకటించారు. అమెరికాతో బలమైన బంధాన్ని ఏర్పాటు చేసుకుంటామని కూడా చెప్పకనే చెప్పారు. సైన్యాన్ని మరింత శక్తిమంతమైనదిగా చేసుకొని ఉత్తర కొరియాపై కఠిన వైఖరిని అవలంభిస్తామని చెప్పారు. అంటే దానర్థం యుద్ధానికి సిద్ధమే అన్నట్లుగా స్పష్టమవుతోంది. దక్షిణ కొరియాకు కొత్త అధ్యక్షుడుగా పీపుల్ పవర్ పార్టీ అభ్యర్థి యూన్ సుక్ యోల్ ఇటీవలనే ఎన్నికయ్యారు. ఎన్నికైన కొన్ని గంటలకే ఉత్తర కొరియాను లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన యూన్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణ కొరియా భద్రత విషయంలో అమెరికా కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా బైడెన్ నొక్కిచెప్పారు. ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాల ద్వారా పొంచివున్న ప్రమాదాలను నివారించే క్రమంలో రెండు దేశాలు సమన్వయంతో పనిచేసేందుకు కట్టుబడి ఉన్నట్లు శ్వేతసౌధం అధికారిక ప్రకటన పేర్కొంది. యూన్ ఎన్నికపై ఉత్తర కొరియా స్పందించలేదు. దక్షిణ కొరియాలో బుధవారం ఎన్నికలు ముగిశాయి. హోరాహోరీగా సాగిన పోరులో యూన్ సుక్ 48.56శాతం ఓట్లతో లిబరల్ ప్రత్యర్థిని ఓడిరచినట్లు గురువారం జాతీయ ఎన్నికల కమిషన్ ఫలితాలు విడుదల చేసింది. అధికార డెమొక్రటిక్ పార్టీకి చెందిన లీ జే ముయుంగ్‌కు 47.83శాతం ఓట్లు రాగా ప్రోగ్రెసివ్ జస్టిస్ పార్టీ అభ్యర్థి సిమ్ శాంగ్ జంగ్‌కు 2.23శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. జాతీయ అసెంబ్లీ భవనంలో పార్టీవారితో కలిసి యూన్ తన విజయాన్ని వేడుక చేసుకున్నారు. యూన్ సుక్ యోల్ మీడియాతో మాట్లాడుతూ, బలమైన సైనిక సామర్థ్యాన్ని ఏర్పాటు చేస్తానని అన్నారు. ఉత్తర కొరియా చట్టవిరుద్ధమైన ప్రవర్తన విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని, ఆ దేశంతో చర్చలకు సిద్ధంగా ఉంటానని యూన్ అన్నారు. అయితే ఈయన మేనెలలో బాధ్యతలను చేపడతారు. అప్పటి నుంచి ఐదేళ్ల అధ్యక్షుడిగా ఉంటారు. ప్రస్తుత అధ్యక్షడు మూన్ జే ఇన్‌పై యూన్ ఆరోపణలు చేశారు. ఈయన అమెరికాకు దూరంగా ఉంటూ చైనా, ఉత్తర కొరియా వైపు మొగ్గు చూపారని విమర్శించారు. ద్వైపాక్షిక చారిత్రక విభేదాల నేపథ్యంలో టోక్యోతో సంబంధాలను మెరుగుపర్చుకోవడం వ్యూహాత్మకంగా ముఖ్యమని గుర్తించాల్సిన అవసరం ఉందని యూన్ నొక్కిచెప్పారు. అమెరికా`దక్షిణ కొరియా మధ్య సంబంధాలను పటిష్టపరుస్తానని, వ్యూహాత్మక సమగ్ర కూటమిని ఏర్పాటు చేస్తానని, ఉదారవాద ప్రజాస్వామిక విలువలే ఇక్కడ కీలకమని, మార్కెట్ ఎకానమీ, మానవహక్కులపైనా దృష్టి పెడతానని ప్రకటించారు. ఏదేమైనప్పటికీ, ఈ పరిణామాలన్నీ ఉత్తర కొరియా టార్గెట్‌గా చేసుకున్నవేనని తెలుస్తోంది. దక్షిణ కొరియాను అడ్డంపెట్టుకొని ఉత్తరకొరియాపై యుద్ధం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికా రెచ్చగొట్టే చర్యలే ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధానికి దారితీసిన విషయం తెల్సిందే. (Story: ఉత్తర కొరియాపై అగ్రరాజ్యం కన్నేసిందా?)
See Also: ఉక్రెయిన్‌లో బయో బాంబ్స్?
See Also: దుబాయిలో ది ఘోస్ట్ హల్‌చల్!