ఇకపై పిల్లలకూ హెల్మెట్!
న్యూఢల్లీ: ఇకపై పిల్లలకు కూడా హెల్మట్ ధారణ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. బైక్‌రైడర్‌కు, చైల్డ్‌కు మధ్య బెల్ట్ తరహా భద్రతాపరికరం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాదాల నుంచి ద్విచక్ర వాహనదారులకు భద్రత కల్పించే వీలుగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలు రూపొందించింది. నాలుగేళ్ల లోపు పిల్లలను బైక్‌పై తీసుకెళ్తే వారికి కూడా హెల్మెట్ పెట్టాలని తెలిపింది. అంతేగాక, బైక్ నడిపే వారికి, చిన్నారులకు మధ్య సేఫ్టీ హార్నెస్(బెల్ట్ లాంటిది) ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. కాకపోతే పిల్లలకు సరిపడా హెల్మెట్ సైజులు మార్కెట్‌లో లేవు. అందువల్ల ఈ హెల్మెట్ల తయారీపై కూడా కేంద్రం దృష్టి పెట్టింది. తొమ్మిది నెలల నుంచి నాలుగేళ్ల లోపు చిన్నారులను బైక్‌పై తీసుకెళ్తే.. వారికి క్రాష్ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. బైక్‌పై పిల్లలు ఉన్నప్పుడు స్పీడ్ 40 కేఎంపీహెచ్‌కు మించరాదని ఆదేశించారు. ఈ కొత్త మార్గదర్శకాలు 2023 ఫిబ్రవరి 15 నుంచి అమల్లో వస్తాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ. 1000 జరిమానాతో పాటు మూడు నెలల పాటు డ్రైవర్ లైసెన్స్‌ను రద్దు చేయనున్నట్లు హెచ్చరించింది. ఈ నూతన మార్గదర్శకాలకు సంబంధించి గతేడాది అక్టోబరులోనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వీటిపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు సేకరించిన అనంతరం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు నాలుగేళ్ల లోపు చిన్నారులకు ప్రత్యేకంగా హెల్మెట్లు తయారు చేయాలని హెల్మెట్ తయారీ సంస్థలను ఆదేశించింది. అప్పటిదాకా సైకిళ్లపై ఉపయోగించే హెల్మెట్లను పిల్లలకు పెట్టాలని స్పష్టం చేసింది. డ్రైవర్ వెనకాల కూర్చుని ఉన్న పిల్లలు బైక్ పైనుంచి పడిపోకుండా సేఫ్టీ హార్నెస్ ధరించాలని మార్గదర్శకాలు స్పష్టంచేశాయి. ఈ హర్నెస్ కనీసం 30 కేజీల బరువు మోసేలా రూపొదించాలని ఉత్పాదక సంస్థలకు సూచించింది.
ట్రాకింగ్ డివైజ్‌లు తప్పనిసరి
ప్రమాదకర రసాయనాల వంటివి రవాణా చేసే వాహనాల విషయంలోనూ కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఆ వాహనాలకు ట్రాకింగ్ సిస్టమ్ డివైజ్‌ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ‘’ఆర్గోన్, నైట్రోజెన్, ఆక్సిజన్ వంటి ప్రమాదకర వాయువులు లేదా రసాయనాలను రవాణా చేసే వాహనాలకు(నేషనల్ పర్మిట్ కిందకు రానివి) ట్రాకింగ్ వ్యవస్థ లేదని మా దృష్టికి వచ్చింది. అందుకే అలాంటి వాహనాలకు ఇకపై వెహికల్ ట్రాకింగ్ వ్యవస్థను అటాచ్ చేయాలని నిర్ణయించాం. దీనిపై డ్రాఫ్ నోటిఫికేషన్ జారీ చేశాం. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా ప్రజలు తమ సూచనలు, సలహాలు తెలియజేయాలి’’ అని కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పిల్లలకు హెల్మెట్, రసాయనాల రవాణా వాహనాలకు ట్రాకింగ్ డివైజ్‌ల అమరిక అనేవి రెండూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖకు సంబంధించి కీలక నిర్ణయాలుగా భావిస్తున్నారు. (Story: ఇకపై పిల్లలకూ హెల్మెట్!)
See Also : ఎమ్మెల్యేతో మేయర్ పెళ్లి