వడ్డే ఓబన్న త్యాగాలు భావితరాలకు స్ఫూర్తి
న్యూస్ తెలుగు/వినుకొండ : స్వాతంత్ర్య సమరయోధుడు వీర వడ్డే ఓబన్న త్యాగాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా వినకొండ పట్టణంలోని నరసరావుపేట రోడ్డులో వడ్డే ఓబన్న విగ్రహానికి చీఫ్ విప్ జీవి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓబన్న ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓబన్న స్వాతంత్ర సమరయోధుడు, సర్వ సైన్యాధ్యక్షుడు, గెరిల్లా యుద్ధ వీరుడు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి సర్వ సైన్యాధ్యక్షుడుగా ఉండి ఆనాటి బ్రిటిష్యులపై అక్రమ పన్ను వసూళ్లకు పాల్పడుతున్నందుకు మన దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణ త్యాగాలు చేసిన మహానుభావుడు అని తెలిపారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మొదటిసారిగా సాయుధ పోరాటంతో దేశ స్వాతంత్ర పోరాటానికి వడ్డే ఓబన్న పునాది వేశారన్నారు. దేశభక్తి, ధైర్య సాహసాలు, నిస్వార్థ త్యాగాలకు నిదర్శనం వడ్డే ఓబన్న అని, ఆయన పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో పెంపొందించు కోవాలన్నారు. ఓబన్న జయంతిని అధికారికంగా జరుపుకునేందుకు ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని వారి అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిడిసిసిబి చైర్మన్ మల్లికార్జున రావు, కూటమి నాయకులు, వడ్డెర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.(Story : వడ్డే ఓబన్న త్యాగాలు భావితరాలకు స్ఫూర్తి )

