యూరియా పక్కదారి పట్టకుండా చూడాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లాలో యూరియా పక్కదారి పట్టకుండా రైతులకు అవసరమైన మేరకు అందే విధంగా చూడాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ విజయిందిర బోయి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్, పోలీస్ శాఖ అధికారులతో యూరియా పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 2500 మెట్రిక్ టన్నుల యూరియా, ఇతర కాంప్లెక్ ఎరువులు నిల్వ ఉన్నాయని, క్రమం తప్పకుండా యూరియా వస్తుంది కాబట్టి రైతులు అనవసరంగా ఆందోళన పడి అవసరానికి మించి కొనాల్సిన అవసరం లేదన్నారు. మునుముందు యూరియా దొరకదనే ఆలోచనతో రైతులు ఎగబడి కొనాల్సిన అవసరం లేదని యూరియా ప్రతి వారం వస్తూనే ఉంటుందన్నారు. ఈ విషయాన్ని రైతులకు అవగాహన కల్పించి ప్రస్తుతం ఉన్న అవసరం మేరకు మాత్రమే కొనుక్కునే విధంగా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులపై ఉందన్నారు. అదేవిధంగా క్రమం తప్పకుండా యూరియా కొంటున్న వారి వివరాలు వారికి అమ్ముతున్న వారి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. యూరియా రైతుల వ్యవసాయ సేద్యానికి తప్ప ఇతర అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోను తరలించడానికి వీలు లేదని తెలిపారు. పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ యూరియా డీలర్ షాపులను, సొసైటి గోదాములు తనిఖీ చేస్తూ ఉండాలని ఆదేశించారు. బ్లాక్ మార్కెట్ పై టాస్క్ ఫోర్స్ ద్వారా ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జ్ యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు గౌడ్, డిఎస్పి వెంకటేశ్వరరావు, కోపరేటివ్ శాఖ అధికారి ప్రసాద్ రావు, ఏ డి ఏ లు, మార్కెటింగ్ శాఖ అధికారి స్వరణ్ సింగ్, రవాణా శాఖ అధికారి మానస తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. (Story:యూరియా పక్కదారి పట్టకుండా చూడాలి)
