విద్యుత్ శాఖలో ఒత్తిళ్లకు యువకుడి బలవన్మరణం
మాజీ ఎమ్మెల్యే బొల్లా ఆవేదన
న్యూస్ తెలుగు / వినుకొండ : విద్యుత్ శాఖలో ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, కూటమి నాయకుల కక్ష సాధింపు చర్యల నేపథ్యంలో ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన ఎస్టీ వర్గానికి చెందిన ఉయ్యాల తిరుపతిరావు (30), ఐటీఐలో ఎలక్ట్రిషియన్ ట్రేడ్ పూర్తి చేసి, 2019 నుంచి శావల్యాపురం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్‌గా కాంట్రాక్టు ఆధారంగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ అనంతరం, తిరుపతిరావుపై స్థానిక నాయకులు, శాఖాధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి మొదలైనట్టు సమాచారం. చివరికి ఉద్యోగం నుంచి తొలగించడంతో అతను తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఉద్యోగం పోవడం, కుటుంబ ఆర్థిక స్థితి దెబ్బతినడం, భార్య పుట్టింటికి వెళ్లిపోవడం వంటి పరిస్థితులు ఆయనను ఆత్మహత్యకు దిగేందుకు దారితీశాయి. ఆదివారం రాత్రి తిరుపతి రావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్పందిస్తూ, “ఇది ఎంతో బాధాకరమైన సంఘటన. బలహీన వర్గాలకు చెందిన యువకుడు రాజకీయ కక్షల కారణంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం. బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి, కుటుంబానికి తగిన న్యాయం చేయాలి. శాసనసభ్యుడు చీఫ్ విప్ ఆంజనేయులు దీనిపై స్పందించి, బాధిత కుటుంబానికి అండగా నిలవాలి అని డిమాండ్ చేశారు. (Story:విద్యుత్ శాఖలో ఒత్తిళ్లకు యువకుడి బలవన్మరణం )