విద్యార్థులకు చదువు ఆరోగ్యమే విజయాలకు పునాది రాళ్ళు
న్యూస్ తెలుగు/వనపర్తి : సమాజంలో నెలకొన్న అనారోగ్యకర పోటీ ప్రపంచంలో నేటి బాల బాలికలు సాధించాలనుకున్న విజయాలకు మంచి చదువు గొప్ప ఆరోగ్యమే పునాది రాళ్లు అని మాజీ ఎంపీపీ, యం.వి.రామన్ విద్యాసంస్థ అధినేత,ప్రముఖ విద్యావేత్త మొగిలి శ్రీధర్ గౌడ్ అన్నారు. ఆదివారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎం.వి.రామన్ హైస్కూల్ ఆడిటోరియంలో అమరచింతకు చెందిన ఎంవి రామన్ హై స్కూల్ విద్యార్థి కీర్తిశేషులు అరవింద్ జ్ఞాపకార్థంగా గాయని శ్యామల స్వీయ రచన గానంతో ఆడియో వీడియో రూపంలో రూపొందించిన కన్నీటి నివాళి పాటను సిపిఐ జిల్లా కార్యదర్శి కే. విజయరాములతో కలిసి మొగిలి శ్రీధర్ గౌడ్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా యం.శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ:-అమరచింత పట్టణం శ్రీకృష్ణ నగర్ కి చెందిన బీడీ కార్మికురాలు ప్రమీల శ్రీనివాసుల ఏకైక ముద్దుల తనయుడు అరవింద్ అలియాస్ చింటూ ఎం.వి. రామన్ హైస్కూల్లో మూడవ తరగతి నుంచి చదువు కొనసాగించాడని అరవిందు చదువుల్లో ఫస్ట్ క్లాస్ వచ్చేవాడని 8వ తరగతి చదువు కొనసాగుతున్న సందర్భంలో 2020 సంవత్సరంలో కోవిడ్ మొదటి వేవ్ చాలా ప్రమాదకరస్థాయిలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అరవిందుకు డెంగ్యూ వ్యాధి ప్రబలి ఏ ఆసుపత్రికి వెళ్లిన వైద్యం అందలేని దుస్థితిలో కళ్ళ ముందే గిలగిల గిల తల్లాడుతూ ప్రాణాలు వదిలాడని కన్నీటి పర్యంతం అయ్యారు. అరవిందు తండ్రి మూడు నెలల పసి వయసులోనే తండ్రి శ్రీనివాస్ మరణించాడని తల్లి అన్ని తానే అరవింద్ సర్వస్వంగా అల్లారు ముద్దుగా పెంచిన అరవిందు అకాల మరణంతో తల్లి కడుపు కోత మాటల్లో వర్ణించలేమని అన్నారు. అరవిందు బ్రతుకు మారాలంటే గొప్ప ఆఫీసర్లు కావాలనేది నిత్యం అంటుండే వాడని కలెక్టర్ కావాలని తన నోట్ బుక్ లో రాసుకునేవాడని గుర్తు చేశారు.అరవింద్ మరణం కుటుంబానికే కాక సమాజం ఒక జ్ఞానవంతుణ్ణి కోల్పోయిందని అన్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుతోపాటు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆరోగ్యంగా ఉంటేనే తన విజయాలు బానిసలు అవుతాయని అన్నారు.అరవింద్ ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని గాయని శ్యామల స్వీయ రచన గానంతో ఆడియో వీడియో ఆల్బమ్ తో పాట తీసుకురావడం అభినందనీయం అని అన్నారు.సిపిఐ జిల్లా కార్యదర్శి కె.విజయరాములు మాట్లాడుతూ:-శాస్త్ర సాంకేతిక రంగం పరిగెడుతూ అత్యాధునిక వైద్యం అందిస్తున్నమని చెప్పుకుంటున్న ఈ ఆధునిక కాలంలో కూడా మెరుగైన వైద్య అందక పసిప్రాణాలు గాలిలో కలవడం అత్యంత బాధాకరమని అన్నారు. విద్యా వైద్యం అందరికీ అందుబాటులో ఉంటేనే మానవ వనరులు దేశ అభివృద్ధికి తోడ్పడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో గాయని శ్యామల,ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు పి.సురేష్. అరవిందు తల్లి ప్రమీల, ప్రజానాట్యమండలి వనపర్తి జిల్లా నేత ఎస్.శ్యాంసుందర్,పి.రాజు, ఎం.వి.రామన్ విద్యాసంస్థ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.(Story : విద్యార్థులకు చదువు ఆరోగ్యమే విజయాలకు పునాది రాళ్ళు )