ఏపీ బడ్జెట్ సమావేశాల తేదీ వచ్చేసింది
ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం
సెలవులతో కలిపి 20 రోజుల ప్రణాళిక
నూతన ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు
న్యూస్ తెలుగు/అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈనెల 28న శుక్రవారం 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి గాను సభలో ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు తమ శాఖల్లో అడిగిన ప్రశ్నలకు పూర్తిస్థాయి సబ్జెక్టుతో హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. దాదాపు మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. సెలవులతో కలుపుకుని 20 రోజుల పాటు సభ నిర్వహణకు కసరత్తు చేస్తోంది. మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయిస్తారు. ఈలోగా ఎమ్మెల్యేలకు అవగాహన తరగతులు నిర్వహించనున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు అవగాహన తరగతులు, వర్క్‌షాప్ కొనసాగనుంది. నూతనంగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి సభా నియమాలు, సభలో సభ్యుల పనితీరు, వ్యవహార శైలి, సభా మర్యాదలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మొదటి రోజు ఎమ్మెల్యేల అవగాహనా తరగతుల కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యే అవకాశముంది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వస్తారని సమాచారం. ఈ బడ్జెట్ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. వాటితోపాటు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపైనా చర్చకు రానున్నాయి. అటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన ఎమ్మెల్యేలు ఈ సారి హాజరయ్యే పరిస్థితులు కన్పించడంలేదు. (Story: ఏపీ బడ్జెట్ సమావేశాల తేదీ వచ్చేసింది)