గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
న్యూస్ తెలుగు /సాలూరు : గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి అన్నారు. శనివారం సాలూరులో చైల్డ్ ఫండ్ సౌజన్యంతో సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ స్వచ్చంద సేవా సంస్థ గిరిజన పిల్లలను దత్తత తీసుకుని చదివించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పిల్లలు పుట్టిన దగ్గర నుండి ఆరు సంవత్సరాల వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఉంచాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చే పౌష్టిక ఆహారం పిల్లల్లో ఎదుగుదలకు తోడ్పడుతుందని తెలిపారు. ఆరు సంవత్సరాలు నిండిన తరువాత ప్రభుత్వ పాఠశాలకు పంపాలని, చిన్న వయసులోనే బడి వదిలి పనికి పంపిస్తే పిల్లల భవిష్యత్ పాడవుతుందని పేర్కొన్నారు. ప్రతీ అంగన్వాడీ కేంద్రానికి ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తోందని, కేంద్రాల్లో టీవీ,త్రాగు నీటి సౌకర్యం, మరుగుదొడ్లు,ఆట వస్తువులు కొనుగోలు కొరకు మంజూరు చేయడం జరిగిందన్నారు. పంచాయతీల్లో అద్దె ఇంట్లో ఉండే అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం భవనాలకు తరలించేలా, ఖాళీ భవనాలు ఉంటే చెప్పాలని సూచించారు. సంస్థ ద్వారా మెడికల్ కిట్లు ఇవ్వడానికి యాజమాన్యం సిద్ధంగా ఉందన్నారు. కేంద్రాలకు బాల సంజీవిని పౌడర్ ను పంపిణి చేస్తున్నామని అది కేవలం మహిళలు మాత్రమే ఉపయోగించేలా అవగాహనా కల్పించాలని అన్నారు.ఈ సందర్బంగా 94 మంది పిల్లలకు పౌష్టిక ఆహార కిట్లను, మూడు కుటుంబాలకు ఆరు మేకలు, పది పాఠశాలల్లో చదివే పిల్లలకు పుస్తకాలు, స్టడీ మెటీరియల్, అయిదు అంగన్వాడీ కేంద్రాలకు ఆట వస్తువులను అందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తమర్భ కొండలరావు, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, మున్సిపల్ కమిషనర్ సి హెచ్ సత్యనారాయణ, తహసీల్దార్ ఎన్ వి రమణ తదితరులు పాల్గొన్నారు.(Story : గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి )