తల్లిదండ్రులు సైతం రోడ్డు భద్రత నియమాల పట్ల తమ పిల్లలకు అవగాహన కల్పించాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి : తల్లిదండ్రులు సైతం రోడ్డు భద్రత నియమాల పట్ల తమ పిల్లలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐ.డి. ఒ .సి ప్రాంగణం నుండి నల్ల చెరువు వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీని జిల్లా కలక్టర్ స్థానిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జిల్లా ఎస్పీతో కలిసి జెండా ఊపి ప్రారంభించడమే కాకుండా స్వయంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవిస్తున్నందునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు భద్రతా వారోత్సవాల నుంచి మాసోత్సవాలుగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, రోడ్డు ప్రమాదాల కారణంగా నష్టపోతున్న వారిలో 60 నుంచి 70 శాతం యువతే ఉన్నారని చెప్పారు. కాబట్టి రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం వల్ల కుటుంబానికి కలిగే నష్టాన్ని ఎవరు పూడ్చలేరని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. జిల్లాను యాక్సిడెంట్స్ ఫ్రీగా మార్చడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే ఆర్టీసీ డ్రైవర్లకు సైతం కంటి పరీక్షల క్యాంపును నిర్వహిస్తామని తెలియజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు తూడి మెఘా రెడ్డి మాట్లాడుతూ రోడ్డు భద్రతకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని చెప్పారు. పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాలని గుర్తు చేశారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిరోజు రోడ్డు భద్రతపై కొంత అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించని వారికి తాము కూడా ఎప్పటికీ సహకరించబోమని కరాఖండిగా చెప్పారు. రాష్ డ్రైవింగ్ కారణంగా జీవితాలను నాశనం చేసుకోకుండా, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని సూచించారు. జిల్లా రవాణాశాఖ అధికారులు లైసెన్సులు జారీ చేసే విషయంలో దృష్టి పెట్టి పకడ్బందీ రోడ్డు భద్రత నియమాలు అమలు చేయాలన్నారు.
జిల్లా ఎస్పీ గిరిధర్ రావుల మాట్లాడుతూ సమాజం మనకు ఎంతో ఇస్తుందని, కాబట్టి మనం కూడా ఇతరులకు ఇబ్బంది కలగకుండా చక్కగా రోడ్డు భద్రత పాటిస్తూ బాధ్యతగా మెలగాలన్నారు. ఇటీవల కాలంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు 50 మంది రోడ్డు భద్రత నియమాలు పాటించని కారణంగా జైలుకు వెళ్లారని చెప్పారు. కాబట్టి రాష్ డ్రైవింగ్ చేసి కష్టాల పాలవకుండా బాధ్యతగా ఉండాలన్నారు. గత ఏడాది కాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా 1.70 లక్షల మంది మరణించినట్లు గుర్తు చేశారు. బైక్ ర్యాలీ సందర్భంగా నల్లచెరువు కట్టపై రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ తెలంగాణ సాంస్కృతిక సారధి, పాఠశాల విద్యార్థులతో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణం స్పందించి సహాయం చేస్తున్న శ్రీనివాస్ అనే యువకుడిని సన్మానం చేసి హెల్మెట్ ను బహుకరించారు. నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి మానస, జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం, యువజన సర్వీసుల శాఖ అధికారి సుధీర్ రెడ్డి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి అంజయ్య ఇతర అధికారులు, విద్యార్థులు, యువత, తదితరులు పాల్గొన్నారు. (story : తల్లిదండ్రులు సైతం రోడ్డు భద్రత నియమాల పట్ల తమ పిల్లలకు అవగాహన కల్పించాలి)