ఫ్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కు సాయి దుర్గ తేజ్ రూ.5 లక్షల విరాళం
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా: మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్. చిన్నారి గుండెలకు తన వంతు భరోసా కల్పించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ‘ఫ్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్’ హైదరాబాద్ బంజారాహిల్స్ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సాయి దుర్గ తేజ్. చిన్నారుల్లో హృదయ సంబంధ సమస్యలకు చికిత్స అందించేందుకు ‘ఫ్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్’ చేస్తున్న ప్రయత్నాన్ని సాయి దుర్గ తేజ్ అభినందించారు. ఈ సంస్థకు తన వంతుగా 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. మనమంతా కలిసి పిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తును సృష్టిద్దామంటూ పిలుపునిచ్చారు సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్. ఆయన మంచి మనసును రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు, ఫ్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ నిర్వాహకులు ప్రశంసించారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే సాయి దుర్గతేజ్..ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో ఇబ్బంది పడిన తెలుగు ప్రజలను ఆదుకునేందుకు తన వంతుగా 20 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. అలాగే విజయవాడలో పర్యటించి అమ్మ అనాథాశ్రమానికి 2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. తనకు వీలైనంత సేవా కార్యక్రమాలు చేస్తూ అవసరంలో ఉన్న వారికి అండగా నిలబడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు సాయి దుర్గ తేజ్. (Story : సాయి దుర్గ తేజ్ ఫ్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ కు రూ.5 లక్షల విరాళం )