గంటగంటకో డెడ్‌బాడీ!
న్యూస్‌తెలుగు/విజయవాడ: విజయవాడ వరదల కారణంగా ప్రాణనష్టం భారీగా జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సింగ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో నీరు తగ్గుముఖం పట్టిన తర్వాత రోడ్లపైన, వీధి సందుల్లో ఒక్కొక్క మృతదేహం బయటపడుతూ ఉంది. గురువారంనాడు గంటకొక మృతదేహం లభ్యమైంది. ప్రభుత్వం సహాయక చర్యలు భారీగా చేపట్టడంతో నిరాశ్రయులకు కాస్త ఊరట లభించింది. అదే సమయంలో తమ కుటుంబం నుంచి గల్లంతయిన వారి గురించి ఆందోళన పెరిగింది. కొందరి ఆచూకీ లభ్యమైనప్పటికీ, ఇంకొందరు మృతదేహంగా దొరుకుతున్నారు. ఇప్పటివరకు ఎన్‌టీఆర్ జిల్లాలో 24 మంది మరణించినట్లు అధికారికంగా వెల్లడైంది. పెద్ద సంఖ్యలో ఫైర్ టెండర్ల సాయంతో క్లీన్ చేస్తున్న దశలో బురద నుంచి మృతదేహాలు బయటపడుతున్నాయి. వాటిని పంచనామా కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. గల్లంతయిన వారి కోసం వారి కుటుంబాలు ఆసుపత్రికి చేరుకొని విలపిస్తున్నారు. అనూహ్యంగా నీరు తగ్గుముఖం పట్టడం, మూడు రోజుల్లో ప్రభుత్వ సహాయకచర్యలు ఊపందుకోవడంతో చాలావరకు ప్రాణనష్టం తగ్గిందనే చెప్పవచ్చు. సహాయం చేయడానికి ఆహారపొట్లాలు, వాటర్ బాటిళ్లు, మందులు విపరీతంగా సరఫరా అవుతున్నప్పటికీ, చివరి వ్యక్తి వరకు సహాయం అందడం లేదన్న ఆరోపణ వస్తున్నది. దాతలు ముందుకొచ్చి సహాయక చర్యలకు అండగా నిలవడమే కాకుండా, పెద్ద ఎత్తున నగదు, మెటీరియల్ ప్రభుత్వానికి అందిస్తున్నారు. మున్సిపల్ అధికారులతోపాటు అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పూర్తిగా సహాయక చర్యల్లోనే మునిగారు. మంత్రులంతా ఫీల్డ్‌లోనే ఉన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అవసరమైతే ఆయన కూడా క్షేత్రస్థాయిలోకి దిగుతున్నారు. మరోవైపు కేంద్ర బృందం వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించింది. శివరాజ్ సింగ్ చౌహాన్ సారథ్యంలోని ఈ బృందం నష్టాన్ని అంచనా వేసింది. కచ్చితంగా కేంద్రం నుంచి సాయం అందుతుందని బృందం పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ బృందానికి వినతిపత్రం అందజేశారు. భారీగా సాయం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. (Story: గంటగంటకో డెడ్‌బాడీ!)