ప్రధాన సూత్రధారులను వదిలి పెట్టేది లేదు
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపిఎస్
గంజాయి అక్రమ రవాణకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు
న్యూస్‌తెలుగు/విజయనగరం :
గంజాయి అక్రమ రవాణ కేసుల్లో పట్టుబడిన వ్యక్తులతోపాటు, అక్రమ రవాణకు కారకులైన ప్రధాన సూత్రదారుల మూలాలలను వెలికితీస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపిఎస్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణకు ఎవరూ పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందితులనువిచారించి, సమాచారం సేకరించడంతోపాటు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గంజాయి అక్రమ రవాణకు ప్రధాన సూత్రదారులను గుర్తించి, అరెస్టు చేస్తామన్నారు. గంజాయి అక్రమ రవాణకు పాల్పడినా, సేవించినా, విక్రయించినా పోలీసుశాఖ తీవ్రంగా పరిగణిస్తుందని, వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపడతామని, ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతోపాటు, చెక్ పోస్టులను బలోపేతం చేస్తామని తెలిపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణకు పాల్పడి, పట్టుబడిన కేసులను రివ్యూ చేసి, ఆయా కేసుల పురోగతిని పరిశీలించి, తదుపరి చర్యలు చేపడతామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన కేసుల్లో ప్రధాన సూత్రదారులను గుర్తించి, వారిని అరెస్టు చేసి, గంజాయి అక్రమ రవాణకు ముగింపు పలుకుతామన్నారు. గంజాయి వినియోగం వలన యువత ప్రక్కదారి పడుతున్నారని, మాదక ద్రవ్యాల మత్తులో నేరస్థులుగా మారుతున్నారన్నారు. వారి భవిష్యత్తును చక్కదిద్దేందుకు మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరిస్తూ, వారిని చైతన్యపరుస్తూ, వాటికి దూరం చేసేందుకు తమవంతు ప్రయత్నంగా కళాశాలలను సందర్శించి, విద్యార్థులకు అవగాహన కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా తమవంతు బాధ్యతను నిర్వహించాలన్నారు. వ్యాపారుల ప్రలోభాలకు, వారు ఇచ్చే నగదుకు ఆశపడి యువత అక్రమ రవాణ ఉచ్చులో పడి, పోలీసులకు చిక్కి, భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారన్నారు. వ్యాపారుల ప్రలోభాలకు లొంగొద్దని, భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని యువతకు పిలుపునిచ్చారు. (Story : ప్రధాన సూత్రదారులను వదిలి పెట్టేది లేదు )